
జూన్ క్వార్టర్‌లో 14,57,461 యూనిట్లు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఎగుమతులు జూన్ త్రైమాసికంలో ఆకర్షణీయంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం పెరిగాయి. మొత్తం 14,57,461 యూనిట్లు ఎగుమతి అయినట్టు ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 11,92,566 యూనిట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర, వాణిజ్య వాహన ఎగుమతులు అధికంగా జరిగాయి.
ప్యాసింజర్ వాహన ఎగుమతులు 2,04,330 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 1,80,483 యూనిట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. మారుతి సుజుకీ 96,181 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను క్యూ1లో ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ఎగుమతులు 69,962 యూనిట్ల కంటే 37 శాతం ఎక్కువ. గత నాలుగేళ్ల నుంచి ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ అగ్రస్థానంలో ఉంటున్నట్టు సంస్థ సీఈవో (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. క్యూ1లో తమ వాటా 47 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు.
మారుతి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా అత్యధికంగా 48,140 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం అధికం. ద్విచక్ర వాహన ఎగుమతులు 11,36,942 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ద్విచక్ర వాహన ఎగుమతులు 9,23,148 యూనిట్ల కంటే 23 శాతం పెరిగాయి. వాణిజ్య వాహన ఎగుమతులు సైతం 23 శాతం పెరిగి 19,427 యనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 34 శాతం పెరిగి 95,796 యూనిట్లకు చేరాయి.