టీడీఎస్‌ విషయంలో వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... | Sakshi
Sakshi News home page

టీడీఎస్‌ విషయంలో వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

Published Mon, May 3 2021 2:06 PM

Income Tax: What is Form 26AS and its purpose - Sakshi

గత వారం వేతన జీవులకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఈ వారం వ్యాపారస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీలు పొడిగించవచ్చు. అయితే, దాన్నలా ఉంచితే.. మీరు ముందుగా అవగాహన పెంచుకోవాల్సిన విషయాలు గురించి తెలుసుకుందాం. 

  • మీ ఆదాయానికి సంబంధించి 1-4-2020 నుంచి 31-3-2021 అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను త్వరలోనే 26ఏఎస్‌ వస్తుంది. అది ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంది. ఇప్పుడు ఆ ఫారంని డౌన్‌లోడ్‌ చేసి చెక్‌ చేయండి. ఈ ఫారంలోని అంశాల్లో మీకు వచ్చి న అన్ని ఆదాయాలకు సంబంధించిన టీడీఎస్‌ వివరాలు ఉంటాయి. వ్యాపారం/వృత్తి రీత్యా వచ్చిన ఆదాయం, దాని మీద టీడీఎస్, ఇంటి అద్దె రూపేణా అందే ఆదాయం మీద టీడీఎస్, వడ్డీ మొదలైన ఇతర ఆదాయాల మీద టీడీఎస్, అలాగే క్యాపిటల్‌ గెయిన్స్‌ మీద టీడీఎస్‌ వంటివన్నీ ఇందులో ఉంటాయి.  
  • అయితే టీడీఎస్‌ జమలు రాకపోతే, అందులో పొందుపర్చకపోతే గాభరా పడక్కర్లేదు. మే/జూన్‌ లోపల అన్నీ ఎంట్రీలు నమోదవుతాయి. అప్పటిదాకా ఆగండి.  
  • ఈ టీడీఎస్‌ వలన మీ మీద పూర్తి ఆదాయపు పన్ను భారం పడకపోవచ్చు. వ్యాపారం విషయంలో నికర లాభం లెక్కించాలి. స్థూల లాభం మీద టీడీఎస్‌ వర్తింపచేస్తే .. పన్ను భారం మాత్రం నికర లాభం మీద ఉంటుంది. 
  • వ్యాపారస్తులు మరో విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే  జీఎస్‌ టీ రిటర్నుల్లో.. టర్నోవరు వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటోంది. ఇది ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్నుల్లో పొందుపర్చిన వివరాలకు సరిపోలి ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటినీ పోల్చి చూస్తారు. తేడా వస్తే ఆరా తీస్తారు. బ్యాంకు ఖాతాల్లో జమకి, టర్నోవరుకి సంబంధ లేకపోయినా ఆ డిపాజిట్లతో కూడా సరిపోల్చి చూసుకోండి. ఇటువంటి విశ్లేషణల కోసం వృత్తి నిపుణుల సహాయం తీసుకోండి. 
  • బ్యాంకు జమల్లో వ్యాపారపరమైనవి కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, అప్పులు కావచ్చు.. ఆదాయాలు కావచ్చు.. ప్రతీ జమని సమర్థించుకోగలిగేలా కాగితాలు ఉండాలి. 

ఇంచుమించు ఇదే పద్ధతిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రణాళికలు వేసుకోండి. ముందు చూపుతో వ్యవహరించడం, సకాలంలో పనులు పూర్తి చేసుకోవడం, చట్టరీత్యా బాధ్యతలు నిర్వర్తించడం .. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. 

కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి,  కె.వి.ఎన్‌ లావణ్య,  ట్యాక్సేషన్‌ నిపుణులు

చదవండి:

వేతన జీవులూ.. జర జాగ్రత్త!

 
Advertisement
 
Advertisement