ఈ వారం ట్రేడింగ్ 3 రోజులే
ముడి చమురు ధరలపై ఫోకస్
ద్రవ్యోల్బణం, రూపాయి కీలకం
విదేశీ ఇన్వెస్టర్ల తీరుకూ ప్రాధాన్యం
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే దిక్సూచిగా నిలవనుంది. యుద్ధ భయాలు తగ్గితే ఇన్వెస్టర్లకు రిలీఫ్.. పెరిగితే మరింత ఆందోళన అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దేశీయంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానున్నప్పటికీ భారీ స్థాయిలో ఆటుపోట్లు తప్పకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్
శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం(31న) దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవుకాగా.. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం(ఏప్రిల్ 3న) సైతం పనిచేయవు. వెరసి ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. అయినప్పటికీ పలు కీలక అంశాలు మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గత వారాంతాన మరింత విస్తరించింది. కాల్పుల విరమణ లేదా దాడులకు పాజ్ అంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. వారాంతన పరిస్థితులు క్షీణించడంతో నేడు(30న) మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గణాంకాల ఎఫెక్ట్
ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. జనవరిలో ఐఐపీ 4.8 శాతం ఎగసింది. మార్చి నెలకు గురువారం(ఏప్రిల్ 2న) హెచ్‌ఎస్‌బీసీ తయారీ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో ఈ వారం చైనా తయారీ పీఎంఐ, ద్రవ్యోల్బణ డేటా విడుదలకానుంది. మరోపక్క యూఎస్ తయారీ పీఎంఐ, రిటైల్ అమ్మకాలు, ఉపాధి, నిరుద్యోగిత తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ధరలపై ఆందోళన వెలిబుచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు అంచనాలు ఏర్పడ్డాయి. వెరసి దేశ, విదేశీ గణాంకాలకూ ప్రాధాన్యమున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
చమురు, రూపాయి
ఇటీవల బ్రెంట్ ముడిచమురు పీపా ధర లండన్ మార్కెట్లో 102–110 డాలర్ల మధ్య కదులుతోంది. దీంతో దేశీ క్రూడ్ బాస్కెట్ 140–150 డాలర్లస్థాయికి చేరుతోంది. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు కారణంకానుంది. దేశీ చమురు అవసరాలకు దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో ఈ ప్రభావం రూపాయినీ దెబ్బతీస్తోంది. గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఏకంగా 95 స్థాయికి దిగజారిన విషయం విదితమే. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా, ఎన్‌రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. తెలియజేశారు. అయితే మార్కెట్లు కుదురుకుంటే షార్ట్‌కవరింగ్‌కూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలకుతోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు సైతం కీలకంగా నిలవనున్నట్లు ప్రస్తావించారు.
భారీ అమ్మకాలు..
ఈ నెలలో మరోసారి అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీస్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నెల 2–27 మధ్యకాలంలో రూ. 1.14 కోట్ల విలువైన(12.3 బిలియన్ డాలర్లు) దేశీ స్టాక్స్ విక్రయించా రు. వెరసి మా ర్చిలో మార్కెట్ల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2024 అక్టోబర్‌లో అత్యధికంగా రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఇందుకు పశ్చిమాసియా యుద్ధం, రూపాయి బలహీనత, చమురు ధరలు, వడ్డీ రేట్ల ఆందోళనలు ప్రభా వం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో గత 17 నెలల్లోలేని విధంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి
గత 4 రోజుల్లో..
నాలుగు రోజులకే పరిమితమైన ట్రేడింగ్‌లో గత వారం సైతం(వరుసగా ఐదో వారం) దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా నష్టాలతోనే నిలిచాయి. సెన్సెక్స్ 950 పాయింట్లు(1.3 శాతం) పతనమైంది. 73,583 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 295 పాయింట్లు(1.3 శాతం) కోల్పోయి 22,820 వద్ద స్థిరపడింది. మార్కెట్లను మించుతూ బీఎస్‌ఈ మిడ్ క్యాప్ 2.2 శాతం, స్మాల్ క్యాప్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి.
సాంకేతికంగా చూస్తే..
ఈ వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. 22,300–22,200 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఈ స్థాయి నుంచి జోరందుకుంటే 23,500–23,700 పాయింట్లకు చేరే అవకాశముంది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ నీరసిస్తే 72,800కు చేరవచ్చు. అమ్మకాలు కొనసాగితే ఆపై 72,250వరకూ క్షీణించే వీలుంది. ఈ స్థాయి నుంచి బలపడితే 76,000 పాయింట్లస్థాయివైపు ప్రయాణించవచ్చు.
స్టాక్స్ వ్యూ
ఇండిగో పెయింట్స్
బ్రోకరేజ్: మిరాయ్ అసెట్ షేర్‌ఖాన్ , కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ. 731, టార్గెట్: రూ. 1,350
ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5 శాతం మెరుగుపడి రూ. 359 కోట్లకు చేరింది. ఇందుకు అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ బిజినెస్ వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 339 కోట్లను తాకడం సహకరించింది. ప్రధానంగా అనుబంధ సంస్థ యాపిల్ కెమీ(రూ. 20 కోట్లు) వృద్ధి సైతం దన్నునిచ్చింది. రుతుపవనాలు కొనసాగడం, ముందుగానే దీపావళి పండుగ అయిపోవడం కారణంగా అక్టోబర్‌లో అమ్మకాలు మందగించాయి. ఎమల్షన్స్ అమ్మకాల పరిమాణం 3.4 శాతం, విలువ 0.2 శాతం చొప్పున క్షీణించాయి.
అయితే ఎనామిల్స్, ఉడ్ కోటింగ్స్ అమ్మకాలు 20 శాతం, విలువ 19 శాతం చొప్పున జంప్‌చేశాయి. పుట్టీ, సిమెంట్ పెయింట్స్ అమ్మకాల పరిమాణం 2 శాతం, విలువ 5.5 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ఇక ప్రైమర్స్, డిస్టెంపర్స్ తదితరాల అమ్మకాలు 7.4 శాతం, విలువ 12.5 శాతం చొప్పున ఎగశాయి. ఉత్తమ మిక్స్, తగ్గిన ముడివ్యయాల కారణంగా స్థూల మార్జిన్లు 46.8 శాతం వద్ద నిలకడను చూపాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు(ఓపీఎం) 2.36 శాతం మెరుగుపడి 19 శాతంగా నమోదయ్యాయి.
ఇందుకు ప్రకటనలు, ప్రమోషనల్(ఏఅండ్‌పీ) వ్యయాలు తగ్గడం తోడ్పాటునిచ్చింది. వార్షికంగా ఇవి 2.6 శాతం తగ్గి 5.6 శాతానికి పరిమితమయ్యాయి. పెయింట్ల పరిశ్రమలో క్రమానుగత రికవరీకితోడు.. వివిధ మార్కెట్లలో విస్తరించడం, సామర్థ్య పెంపు ఆదాయంలో వృద్ధికి దన్నుగా నిలవనున్నాయి. ముడివ్యయాలలో తగ్గుదల, నిలకడ కారణంగా సమీప కాలంలో లాభదాయకతకు మద్దతు లభించనుంది. రానున్న రెండేళ్ల కాలం(2026–27, 2028)లో వార్షికంగా ఆదాయం 9 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున పురోగమించగలవని భావిస్తున్నాం.
ఎంఎం ఫోర్జింగ్స్
బ్రోకరేజ్: ఆనంద్ రాఠీ రీసెర్చ్ ,కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ. 400 , టార్గెట్: రూ. 600
ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఎంఎం ఫోర్జింగ్స్ అంచనాలకు అనుగుణంగా రూ. 72 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. వార్షికంగా ఇది 2 శాతం క్షీణతకాగా.. రానున్న రెండేళ్లలో కంపెనీ పనితీరు మెరుగుపడే అవకాశముంది. వార్షిక ప్రాతిపదికన 2026–28 కాలంలో ఆదాయం 13 శాతం, ఇబిటా 18 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా. ఈ కాలంలో దేశీయంగా భారీ, మధ్యతరహా వాణిజ్య వాహన(ఎంఅండ్‌హెచ్‌సీవీ) అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకోనున్నట్లు భావిస్తున్నాం.
ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోగతి, జీఎస్‌టీ రేట్ల సంస్కరణలతో పటిష్టమవుతున్న రీప్లేస్‌మెంట్ డిమాండ్ సహకరించే వీలుంది. వీటికితోడు లోబేస్ కారణంగా విదేశాలలో వాణిజ్య వాహన(సీవీ) రంగ అమ్మకాలు ఊపందుకోనున్నాయి. పర్యావరణ నిబంధనల అమలుకంటే ముందుగానే చేపట్టనున్న కొనుగోళ్లు ఇందుకు మద్దతివ్వనున్నాయి. అయితే సమీప కాలంలో అంతంతమాత్ర పనితీరు ప్రదర్శించనున్నప్పటికీ.. తాజా ఆర్డర్ల ప్రభావంతో ఆదాయంలో పరిశ్రమను మించిన వృద్ధిని సాధించనుంది. విభిన్న ప్రొడక్టులు, అధిక మెషీనింగ్‌కుతోడు భారీ ఫోర్జింగ్స్ మిక్స్ ఇందుకు తోడ్పాటునివ్వనున్నాయి.
అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో అధిక ఎగుమతుల కారణంగా స్టాండెలోన్ ఆదాయం 11 శాతం ఎగసి రూ. 405 కోట్లను తాకింది. దేశీ ఆదాయం 14 శాతం బలపడి రూ. 256 కోట్లకు చేరింది. ఎగుమతులు 7 శాతం పుంజుకుని రూ. 148 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మార్జిన్లు 4.4 శాతం క్షీణించి 53 శాతానికి పరిమితంకాగా.. నికర లాభం 19 శాతం నీరసించి రూ. 26 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదిలో ఈపీఎస్ 8 శాతంమేర నీరసించవచ్చు. అయితే 2026–27, 2028లలో 12–16 శాతంమేర మెరుగుపడవచ్చని అంచనా.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే


