IMF Chief Kristalina Georgieva: ప్లీజ్‌.. భారత్‌ను బతిమాలుతున్నాం, ఆ నిషేధాన్ని ఎత్తేయండి: ఐఎంఎఫ్‌ చీఫ్‌

IMF Request India To Lift Wheat Export Ban ASAP - Sakshi

దావోస్‌: ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలీనా జార్జియేవా(68) Kristalina Georgieva.. భారత్‌ను బతిమాలుతున్నారు. గోధుమ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై వీలైనంత త్వరగా పునరాలోచన చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. 

అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ స్థిరత్వంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నక్రిస్టలీనా.. వీలైనంత త్వరగా నిషేధాన్ని ఎత్తేయాలని కోరారు. వేసవి ప్రభావంతో గోధుమ ఉత్పత్తి తగ్గిపోవడం, దేశీయంగా ధరలు పెరిగిపోవడంతో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్‌ తరపున ఈ పరిస్థితులను అర్థం చేసుకోగలమని పేర్కొన్న ఆమె.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడబోయే సంక్షోభ స్థితిని భారత్‌ అర్థం చేసుకోవాలని కోరారు.

భారతదేశాన్ని వీలైనంత త్వరగా పునరాలోచించవలసిందిగా నేను వేడుకుంటున్నాను, ఎందుకంటే ఈ నిర్ణయంతో ఎక్కువ దేశాలు ఎగుమతి ఆంక్షలపైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. మరికొన్ని దేశాలు కూడా ఆ ఆలోచన చేయొచ్చు. అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కష్టతరంగా ఉంటుంది అని ఆమె అన్నారు. 

ఇప్పటికే ఓ పక్క యుద్ధ సంక్షోభం కొనసాగుతోంది. ఈజిప్ట్‌, లెబనాన్‌ లాంటి దేశాల ఆకలి తీర్చేది భారత్‌. అలాంటప్పుడు భారత్‌ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆకలి కేకలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సామాజిక అశాంతి నెలకొనే అవకాశం ఉంది అని ఆమె అభ్రిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్‌ దావోస్‌ వేదికగా ఓ భారతీయ మీడియాతో ఆమె పైవ్యాఖ్యలు చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top