కేశాలతో రూ. కోట్లు.. హైదరాబాదీ సిస్టర్స్‌ బిజినెస్‌ అదుర్స్‌! | Hyderabad Sisters Earning Rs 27 Crore A Year By Selling Hair Extensions - Sakshi
Sakshi News home page

కేశాలతో రూ. కోట్లు.. హైదరాబాదీ సిస్టర్స్‌ బిజినెస్‌ అదుర్స్‌!

Published Mon, Sep 25 2023 6:03 PM

Hyderabad sisters earning Rs 27 crore a year by selling hair extensions - Sakshi

అందాల ప్రపంచంలో జుట్టుకున్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. చాలా మంది భారతీయ మహిళలకు జుట్టు రాలడం, పొట్టి కేశాలు అనేవి తీవ్రవైన సమస్యలు. ఈ నేపథ్యంలో ఇటీవల హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ రహస్యాన్ని గ్రహించిన హైదరాబాదీ సిస్టర్స్‌ బిజినెస్‌ ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్నారు. 

రిచా గ్రోవర్ భద్రుకా (Richa Grover Badruka), రైనా గ్రోవర్ (Raina Grover).. హైదరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. భారత్‌లో హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను అర్థం చేసుకున్నారు. 2019లో ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీగా తమ బ్రాండ్ ‘1 హెయిర్ స్టాప్‌’ (1 Hair Stop)ను ప్రారంభించారు. మొదట్లో రోజుకు 2-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ఆర్డర్ల సంఖ్య 130-150కి పెరిగింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన వీరి బిజినెస్‌ ఈ ఏడాది రూ. 31 కోట్లు ఆర్జించే దిశగా అడుగులు వేస్తోంది.

అదే ప్రేరణ
మహిళల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారాలు మార్కెట్లో లేవని తాము గ్రహించామని,  1 హెయిర్ స్టాప్‌తో నిజమైన పరిష్కారాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రిచా గ్రోవర్ భద్రుకా చెబుతున్నారు. భారత్‌ గ్లోబల్ హెయిర్ ఎగుమతిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో అంతరాన్ని గుర్తించడంతో వారి ప్రయాణం ప్రారంభమైంది. భారతీయ మహిళల ప్రత్యేక అవసరాలకు ప్రత్యేకంగా అధిక-నాణ్యత జుట్టు ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని అని ఆమె పేర్కొంటున్నారు.

కలిసొచ్చిన తండ్రి వ్యాపారం
ఈ సిస్టర్స్‌ బిజినెస్‌ ప్రయాణంలో తమ వ్యక్తిగత నేపథ్యం కూడా కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌లో పెరిగిన రిచాకు చిన్నప్పటి నుంచి అందం, ఫ్యాషన్‌పై మక్కువ ఎక్కువ. ఆమె తండ్రి ఒకటిన్నర దశాబ్దం పాటు జుట్టు వ్యాపారంలో ఉండటం కూడా ఆమె సంకల్పానికి కలిసొచ్చింది. చదువును పూర్తి చేసిన తర్వాత రిచా కుటుంబ వ్యాపారంలో చేరారు. భారతీయ మార్కెట్‌కు నేరుగా సేవలందించే లక్ష్యంతో 2019లో ‘1 హెయిర్ స్టాప్‌’ను ప్రారంభించే ముందు ఆమె మొదట్లో హోల్‌సేల్ ఎగుమతులపై దృష్టి సారించారు.

స్టార్టప్‌గా ప్రారంభమై..
స్టార్టప్‌గా ప్రారంభమైన ‘1 హెయిర్ స్టాప్’ మంచి వృద్ధిని సాధించింది. నేడు ఆధిపత్య పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది.  ప్రారంభంలో రోజుకు కేవలం 1-3 ఆర్డర్‌లు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150-160 ఆర్డర్లు వస్తున్నాయి. ప్రారంభ రోజులలో కేవలం రూ. 10,000 మార్కెటింగ్ బడ్జెట్‌ ఉండేది. ఇప్పుడు మార్కెటింగ్ కోసం నెలకు రూ. 10-16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే వారి బిజినెస్‌ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తమ ఉత్పత్తులను బయటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 1 హెయిర్‌ స్టాప్‌ ఆదాయంలో 75 శాతం భారత్‌ నుంచి వస్తుంటే మిగిలినది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల నుంచి వస్తోంది.

మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు
1 హెయిర్‌ స్టాప్‌ ఇప్పటివరకూ 1.2 లక్షలకు పైగా ఆర్డర్‌లను అందుకుంది.  2.1 లక్షలకు పైగా ఉత్పత్తులను విక్రయించింది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు దాటాయి.  2022 ఆ సంస్థకు అత్యంత లాభదాయకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో కంపెనీకి 47,000 ఆర్డర్‌లు రాగా 90,000 ఉత్పత్తులను విక్రయించింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

ట్రెండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు
కొత్త తరం అమ్మాయిలు హెయిర్‌స్టైల్‌తో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. క్లీన్ గర్ల్ ఈస్తటిక్, ఫెయిరీ గర్ల్ ట్రెండ్, బార్బీ కోర్ ఈస్తెటిక్‌ హెయిర్‌ స్టైల్స్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ హెయిర్‌ ఎక్స్‌టెన్షన్‌లు అవసరం. దీనికి అగుణంగా 1 హెయిర్ స్టాప్ పోర్ట్‌ఫోలియోలో కలర్‌ఫుల్ స్ట్రీక్స్, మెస్సీ బన్స్, పోనీ టెయిల్స్, ఫ్లైఫిక్స్, లేస్, సిల్క్ టాపర్‌లు ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ని ప్రారంభించడం ద్వారా ఆఫ్‌లైన్ స్పేస్‌లోకి ప్రవేశించాలని 1 హెయిర్ స్టాప్ యోచిస్తోంది. అదనంగా  బ్రాండ్ తన హెయిర్‌కేర్ శ్రేణిని విస్తరించడం, సెలూన్ నెట్‌వర్క్‌లతో సహకారాన్ని అన్వేషించడం, సెమీ-పర్మనెంట్ హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లను భారతీయ కస్టమర్లకు పరిచయం చేయడంపై దృష్టి సారించింది.

Advertisement
 
Advertisement