Paytm Share Price Drop: Nykaa Founder Falguni Nayar Crossed Paytm Vijay Shekhar Sharma - Sakshi
Sakshi News home page

పతనం అవుతున్న పేటీఎం.. స్థిరంగా కొనసాగుతున్న నైకా

Mar 17 2022 11:08 AM | Updated on Mar 17 2022 1:05 PM

 Huruns Global Rich List: Nykaa Founder Falguni Nair Crossed Paytm Vijay Shekar Sharma - Sakshi

బ్యాంకింగ్‌ సెక్టార్‌పై బ్యూటీ పైచేయి సాధించింది. ఆర్థిక రంగంలో సేవలు అందించే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మని సౌందర్య ఉత్పత్తులు అందించే నైకా ఫౌండర్‌ ఫాల్గుని నాయర్‌ వెనక్కి నెట్టారు. తాజాగా హురూన్‌ గ్లోబల్‌ రిచ్‌లిస్ట్‌ 2022 ఫలితాల్లో ఇది చోటు చేసుకుంది. పేఈఎం, నైకా సంస్థలు గతేడాది నవంబరులో మార్కెట్‌లో ఐపీవోకి వచ్చాయి. 

స్థిరంగా ఫాల్గుని నాయర్‌
హురూన్‌ గ్లోబల్‌ రిచ్‌లిస్ట్‌ 2022 జాబితాలో నైకా ఫౌండర్‌ ఫాల్గుని నాయర్‌ సంపదన 4.9 బిలియన్‌ డాలర్లుగా తేలింది. ప్రపంచ సంపాదనపరుల లిస్టులో ఆమెకు 579వ స్థానం దక్కింది. సౌందర్య ఉత్పత్తులు అందించే కంపెనీగా నైకాను 2012లో ఫాల్గుని నాయర్‌ స్థాపించారు. నైకా యాప్‌ ద్వారా అమ్మకాలు ప్రారంభించారు. చాపకింద నీరులా ఈ కంపెనీ కస్టమర్ల మనసును గెలుచుకుంది. గతేడాది ఐపీవోలో నైకా బంపర్‌హిట్‌ అయ్యింది. దీంతో ఒక్క రోజులోనే ఫాల్గుని నాయర్‌ సెల్ఫ్‌మేడ్‌ బిలియనీర్‌గా మారింది.

ఆది నుంచి ఇబ్బందులే
ఐఐటీ విద్యార్థిగా విజయ్‌శేఖర్‌ శర్మ ఆన్‌లైన్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌గా పేటీఎంను ప్రారంభించారు. ఆరంభం నుంచి నిధుల సమన్యు ఎదుర్కొన్నా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. 2016 పెద్ద నోట్ల రద్దుతో పేటీఎం దశాదిశా మారిపోయింది. దేశమంతటా విస్తరించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే టెక్‌ఫిన్‌ రంగంలో అనేక కంపెనీలు వచ్చాయి. గతేడాది నవంబరులో ఐపీవోలో పేటీఎం షేరు రూ.2150 దగ్గర ట్రేడ్‌ అయ్యింది. దీంతో 2.35 బిలియన్ల మార్కెట్‌ క్యాప్‌తో పేటీఎం శేఖర్‌ శర్మ సైతం బిలియనీర్‌గా మారిపోయాడు.

పోయిన బిలియనీర్‌ హోదా
గడిచిన మూడు నెలల కాలంలో పేటీఎం షేర్లు వరుసగా కోతకు గురవుతూ వస్తున్నాయి. దాదాపు షేరు ధర 70 శాతానికి పైగా పడిపోయింది. దీంతో మూడు నెలలుగా ప్రతీ రోజు విజయ్‌శేఖర్‌శర్మ ఆదాయానికి రోజుకు 88 కోట్ల కోత పడుతూ వచ్చింది. బుధవారం ఏకంగా రూ.630కి పడిపోవడంతో విజయ్‌శేఖర్‌ శర్మ మార్కెట్‌ క్యాప్‌ 999 మిలియన్లను పడిపోయింది. ఆఖరికి ఆయన బిలియనీర్‌ హోదాను కూడా కోల్పోయారు. గురువారం షేరు ధర సుమారు 18 శాతం క్షీణించి రూ. 616 దగ్గర ట్రేడవుతోంది. 

కోత పడినా
గత నవంబరు నుంచి మార్కెట్‌లో కరెక‌్షన్‌ నెలకొంది. అనేక కంపెనీల షేర్ల విలువకు కోత పడింది. కానీ నైకా షేర్లకు ఈ ఇబ్బంది తప్పకపోయినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. ఐపీవో ఆరంభంలో నైకా షేరు రూ.2,205లు ఉండగా ప్రస్తుతం రూ.1522గా ఉంది. మొత్తంగా ఫాల్గుని నాయర్‌ సంపదకు కోత పడినా పేటీఎంతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది.

చదవండి: బెజోస్‌ మస్క్‌ అదానీ ముందు దిగదుడుపే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement