Key Things To Know Before Buying Gold During Dhanteras And Diwali Festival 2022 - Sakshi
Sakshi News home page

బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి, ముఖ్యంగా పండగ సమయాల్లో

Published Sun, Oct 23 2022 11:06 AM

How Should People Buy Gold During Dhanteras And Diwali - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక సంక్రాంతి, దసరా.. ముఖ్యంగా దంతెరాస్‌, దీపావళి వంటి పండగల సమయాల్లో ఫిజికల్‌ గోల్డ్‌, గోల్డ్‌ కాయిన్స్‌, జ్వువెలరీ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో బంగారంపై హాల్‌మార్క్‌ తప్పని సరిచేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ధంతేరాస్, దీపావళికి ఫిజికల్ గోల్డును ఎలా కొనుగోలు చేయాలి? పండగల సమయాల్లో ఎంత బంగారం కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.  

ఇందుకోసం పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ, బంగారంపై తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీలో ఉన్న ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పెథే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూనమ్ రుంగ్తా జాతీయ మీడియాకు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి.  

కోవిడ్‌- 19 లాక్‌డౌన్‌ ఎత్తివేత, తగ్గిపోతున్న మహమ్మారి కారణంగా భారత్‌లో బంగారంపై డిమాండ్ పెరుగుతుందా? ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయి.  

రాజీవ్ పాప్లీ :
అవును, బంగారానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే? రక్షా బంధన్‌ నుంచి బంగారం విక్రయాలు ఊపందుకున్నాయి. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో అనిశ్చిత కాలంలో గోల్డ్‌లో పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడి దారులు భావిస్తున్నారు.  

ఆశిష్ పేథే : గత రెండేళ్లుగా నేను చూస్తున్న మరో ట్రెండ్ ఏమిటంటే పెట్టుబడి దారులు ముఖ్యంగా యువకులు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రెట్టింపు ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించాయి.

హాల్‌మార్క్ లేని ఆభరణాలను తప్పుగా అమ్మడం సాధ్యమేనా?

పెథే : హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయిన 282 జిల్లాల్లో మీరు బంగారం కొనుగోలు చేస్తే, హాల్‌మార్క్ లేని ఒక్క ఆభరణాన్ని కూడా విక్రయించలేరు. 2 గ్రాముల చిన్న ముక్క లేదా చిన్న చెవిపోగు కూడా హాల్‌మార్క్ చేయబడాలి. వాస్తవానికి, ప్రతి స్వర్ణకారుడు కనీసం 10x మాగ్నిఫికేషన్ ఉన్న భూతద్దం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది. తద్వారా వినియోగదారు హాల్‌మార్కింగ్‌ను తనిఖీ చేయవచ్చు. 18-క్యారెట్ బంగారు ముక్క మొదలైన వాటి కోసం మార్కింగ్‌ను వివరించే చార్ట్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. 

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి  

పూనమ్ రుంగ్తా :
మనం భారతీయులం. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ మన పెట్టుబడుల్ని మాత్రం ఆభరణాల్లో కలపకూడదు. ఎందుకంటే? కొన్న బంగారాన్ని కుటుంబ సభ్యులకు విభజించాలంటే.. వాటిని అమ్మాల్సి ఉంటుంది. అందువల్ల, గోల్డ్‌ బార్‌గా లేదా ఇ-గోల్డ్ లేదా పేపర్ గోల్డ్‌ కొనుగోలు చేయడం వంటి మార్గాలు బంగారంపై ఉత్తమమైన పెట్టుబడిగా భావించాలి. బంగారాన్ని ఈక్విటీ (షేర్లు), డెబిట్ వంటి ఏదైనా ఇతర ఆస్తిలాగా పరిగణించండి. భౌతిక రూపంలో (స్వచ్ఛమైన బంగారం) లేదా గోల్డ్ ఇటిఎఫ్‌లలో మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం బంగారం రూపంలో ఉంచండి.

ధంతేరస్, దీపావళి సమయాల్లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి?  

రుంగ్తా : ప్రజలు ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయని గుర‍్తుంచుకోవాలి. ఎందుకంటే బంగారం ధర కూడా డిమాండ్, సప్లై నిర్విరామంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కొనుగోలు దారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే? పండగల సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆ సమయంలో కొద్ది బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణ సమయాల్లో మీకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. 

ధంతేరాస్, దీపావళి సమయంలో మేకింగ్‌ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారు నాణేలు కొనుగోలు చేయడం ఉత్తమమేనా?  

రుంగ్తా : తక్కువ మేకింగ్‌ ఛార్జీల సంగతి అటుంచితే. బంగారు నాణేలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మనకు తెలిసినట్లుగా, బంగారు కడ్డీలు, నాణేలు 24-క్యారెట్ల స్వచ్ఛమైన నాణ్యతతో వస్తాయి. అంతేకాకుండా, బంగారు నాణేలు వినియోగం కంటే పెట్టుబడి పెడితే ఎక్కువ రుణాలు ఇస్తాయి.

Advertisement
 
Advertisement