గృహ విక్రయాలు డౌన్‌ | Sakshi
Sakshi News home page

గృహ విక్రయాలు డౌన్‌

Published Wed, Jul 7 2021 8:54 AM

House sales In Hyderabad Going Down Said By JLL India Report - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా మహమ్మారి దేశీయ గృహ విభాగాన్ని వెంటాడుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గత త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్‌–జూన్‌ (క్యూ2)లో గృహ విక్రయాలు 23 శాతం క్షీణించాయి. ఏడాది క్రితంతో పోలిస్తే మాత్రం 83 శాతం వృద్ధి అని జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే నగరాలలో ఈ ఏడాది క్యూ2లో మొత్తం 19,635 ఇళ్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంలో 10,753 యూనిట్లు సేల్‌ అయ్యాయి. ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1)లో 25,583 గృహాలు విక్రయమయ్యాయి.  

సేల్స్‌ డౌన్‌.. 
బెంగళూరు, ముంబైలలో మినహా మిగిలిన అన్ని ప్రధాన నగరాలలో గృహ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. క్యూ1లో బెంగళూరులో 2,382 యూనిట్లు సేల్‌ కాగా.. క్యూ2 నాటికి 47 శాతం వృద్ధి రేటుతో 3,500లకు, ముంబైలో 5,779 యూనిట్ల నుంచి 1 శాతం వృద్ధితో 5,821 గృహాలకు పెరిగాయి. ఇక, హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 3,709 ఇళ్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 15 శాతం తగ్గి 3,157 యూనిట్లకు పరిమితమయ్యాయి. చెన్నైలో 3,200 నుంచి 600లకు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 5,448 నుంచి 2,440లకు, కోల్‌కతాలో 1,320 నుంచి 578కి, పుణేలో 3,745 నుంచి 3,539 యూనిట్లకు తగ్గాయి.

లాంచింగ్స్‌ అప్‌.. 
కొత్త గృహాల లాంచింగ్స్‌లో మాత్రం హైదరాబాద్‌లో మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో కొత్త గృహాల ప్రారంభాలలో క్షీణత నమోదయింది. నగరంలో గతేడాది క్యూ1లో 2,949 యూనిట్లు లాంచింగ్‌ కాగా.. క్యూ2 నాటికి 71 శాతం పెరుగుదలతో 5,034 గృహాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8,591 ఇళ్లు ప్రారంభం కాగా.. సెకండ్‌ క్వాటర్‌ నాటికి 28 శాతం వృద్ధి రేటుతో 10,980 గృహాలు లాంచింగ్‌ అయ్యాయి.     
 

Advertisement
 
Advertisement
 
Advertisement