
క్రెడిట్ గ్యారంటీ పథకం సవరణ
రుణ పరిమితి రూ.20 కోట్లకు పెంపు
ప్రకటించిన డీపీఐఐటీ
న్యూఢిల్లీ: ‘క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ (సీజీఎస్) సవరణతో స్టార్టప్‌లకు రుణ వితరణ సులభతరం అవుతుందని.. పరిశోధన, అభివృద్ధికి (ఆర్‌అండ్‌డీ) మరింత ఆర్థిక సాయం లభిస్తుందని, గొప్ప టెక్నాలజీ ఆవిష్కరణకు ఊతం లభిస్తుందని కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) పేర్కొంది. సవరించిన సీజీఎస్‌ఎస్‌కు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో ఒక్కో స్టార్టప్‌కు హామీతో కూడిన రుణ వితరణ పరిమితి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరిగింది. ఇదంతా కూడా హామీలేని రుణమే.
‘‘ఈ పథకం విస్తరణతో స్టార్టప్‌లకు రుణ వితరణ రిస్‌్కలు మరింత తగ్గుతాయి. ఆర్‌అండ్‌డీ, ప్రయోగాలు, అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతికతలను సృష్టించడానికి కావాల్సిన ఆర్థిక మద్దతు లభిస్తుంది’’అని డీపీఐఐటీ ప్రకటించింది. స్టార్టప్‌కు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల వరకు ఉంటే వాటికి ప్రభుత్వ హామీ 85 శాతంగా, అంతకుమించిన రుణాలకు 75 శాతంగా ఉంటుందని తెలిపింది.
దేశంలో స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా 2016 జనవరి 16న కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగానే 2022 అక్టోబర్ 6న సీజీఎస్‌ఎస్ పథకాన్ని తీసుకొచి్చంది. స్టార్టప్‌లకు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్‌బీఎఫ్‌సీలు మంజూరు చేసే రుణ సదుపాయాలకు నిర్దేశిత మేర ప్రభుత్వం హామీ కల్పించింది. ఈ ఏడాది జనవరి నాటికి 1.61 లక్షల స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించడం గమనార్హం.