
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఇటీవల తెలిపిన నేపథ్యంలో ప్రధాన వాహనాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా బస్సులపై పన్నును 28% నుంచి 18%కి, ట్రాక్టర్లపై పన్నును 12% నుంచి 5%కు తగ్గించే ప్రతిపాదనలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజారవాణాను మెరుగుపరచడం, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ఈ కేటగిరీల్లో అమ్మకాలను పెంచేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
వ్యవసాయ యాంత్రీకరణకు ఊతం
వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి, రైతులపై వ్యయ భారాన్ని తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రాక్టర్లు, వాటి విడిభాగాలపై పన్నును తగ్గించడం వల్ల మూలధనం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయంటున్నారు. దీనివల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందని, గ్రామీణ ఆదాయాలు అధికమవుతాయని భావిస్తున్నారు. ఇదిలాఉండగా, కంపెనీలు తయారు చేసే యంత్రాలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే అర్హతను కొనసాగించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇన్‌పుట్ ట్యాక్స్‌లు ఎక్కువగా ఉన్నందున మరిన్ని రిఫండ్‌లు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్కార్ట్స్ కుబోటా డైరెక్టర్, సీఎఫ్‌వో భరత్ మదన్ తెలిపారు. ఇన్‌పుట్ ఖర్చులు ప్రస్తుతం 14-15 శాతంగా ఉన్నాయని, 12 శాతం అవుట్‌పుట్ ట్యాక్స్ ఉందని పేర్కొన్నారు.
ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్(టీఎంఏ) డేటా ప్రకారం, ట్రాక్టర్ అమ్మకాలు ఇప్పటికే పెరుగుతున్నాయి. దేశీయంగా 2025 జనవరి-జులై కాలంలో 14% పెరిగాయి. ఇది 5,50,948 యూనిట్లుగా ఉంది. గతేడాది 4,84,024 యూనిట్ల నుంచి పెరిగింది.
బస్ సెగ్మెంట్‌లో ఇలా..
ప్రస్తుతం 28% జీఎస్టీని ఎదుర్కొంటున్న బస్సులు, వాటి విడిభాగాలపై కూడా ఉపశమనం కల్పించవచ్చు. దీన్ని 18 శాతానికి చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపాదిత 10 పాయింట్ల తగ్గింపు ఈ విభాగంలో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులకు ఇటీవలి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతో కలిసొస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ సెగ్మెంట్లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ జీఎస్టీ తగ్గింపు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, మీడియం, హెవీ బస్ సేల్స్ 2025 ఆర్థిక సంవత్సరంలో 23% పెరిగి 66,328 యూనిట్లకు చేరుకున్నాయి. లైట్ ప్యాసింజర్ క్యారియర్లు కూడా 6% పెరిగి 54,807 యూనిట్లకు చేరుకున్నాయి.
ఇదీ చదవండి: నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ