BPCL: బీపీసీఎల్‌ ప్రెవేటైజేషన్‌కు బ్రేక్‌: ఎందుకంటే?

Govt puts on hold BPCL divestment as most bidders walk out - Sakshi

వాటా విక్రయ ప్రతిపాదన వెనక్కి

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) ప్రైవేటైజేషన్‌ ప్రతిపాదనకు బ్రేక్‌ పడింది. దాదాపు 53 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంతో కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో  ఉన్నారు.  దీంతో ప్రైవేటీకరణకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులరీత్యా ప్రస్తుతం ప్రయివేటైజేషన్‌ ప్రక్రియలో పాల్గొనలేమంటూ అత్యధిక శాతం బిడ్డర్లు అశక్తతను వ్యక్తం చేసినట్లు దీపమ్‌ పేర్కొంది.

కంపెనీలో ప్రభుత్వానికిగల మొత్తం 52.98% వాటాను విక్రయించేందుకు తొలుత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా 2020 మార్చిలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అదే ఏడాది నవంబర్‌కల్లా కనీసం మూడు సంస్థలు బిడ్స్‌ దాఖలు చేశాయి. అయితే ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు సంస్థలు రేసు నుంచి వైదొలగాయి. దీంతో ఒక కంపెనీ మాత్రమే బరిలో నిలిచింది.

ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ రద్దుకు నిర్ణయించినట్లు దీపమ్‌ వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ అంశంపై భవిష్యత్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకి వేదాంతా గ్రూప్, యూఎస్‌ వెంచర్‌ ఫండ్స్‌ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ ఇంక్, ఐ స్క్వేర్‌డ్‌ క్యాపిటల్‌ అడ్వయిజర్స్‌ ఈవోఐలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్‌ షేరు 0.5% నీరసించి రూ. 325 వద్ద ముగిసింది. శుక్రవారం స్వల్ప లాభంతో అక్కడే కదలాడుతోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top