
కొంత లాభమే చూసుకోండి
రిటైలర్లకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: పప్పుల విక్రయాల్లో లాభాల మార్జిన్లు తగ్గించుకోవాలంటూ రిటైలర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. గడిచిన నెల రోజుల్లో హోల్‌సేల్ మార్కెట్లో కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు ధరలు 4 శాతం వరకు తగ్గగా.. వాటి రిటైల్ ధరలు అంత మేర తగ్గకపోవడాన్ని కేంద్రం గుర్తించింది. దీంతో సహేతుక లాభాలకు పరిమితమై, వినియోగదారులకు ఉపశమనాన్ని కలి్పంచాలంటూ రిటైలర్లను కేంద్ర ప్రభుత్వం కోరింది.
అనుచిత వ్యాపార విధానాలు, లాభాపేక్షతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ గట్టి హెచ్చరిక పంపింది. రిటైలర్ల సమాఖ్య (ఆర్‌ఏఐ), రిటైల్ సంస్థలతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కందిపప్పు, శనగపప్పు నిల్వలపై ఆ శాఖ కార్యదర్శి నిధి ఖరే సమీక్ష నిర్వహించారు. ఆర్‌ఏఐ ప్రతినిధులు, రిలయన్స్ రిటైల్, డీమార్ట్, టాటా స్టోర్స్, స్పెన్సర్స్, వీమార్ట్ తదితర సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆర్‌ఏఐ పరిధిలో 2,300 మంది సభ్యులు (రిటైలర్లు), 6 లక్షల రిటైల్ స్టోర్లు ఉన్నాయి. హోల్ సేల్ ధరలు, రిటైల్ ధరల మధ్య భిన్నమైన ధోరణులు ఉన్నాయని, రిటైలర్లు అధిక మార్జిన్లు పొందుతున్నట్టు తెలుస్తోందని నిధి ఖరే సమావేశంలో స్పష్టం చేశారు. ధరల నియంత్రణకు, వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని ఆమె రిటైలర్లను కోరారు.