టెక్ దిగ్గజం గూగుల్ తన వినియోగదారులకు షాకిచ్చేలా ఉచిత క్లౌడ్ స్టోరేజ్ విధానంలో కీలక మార్పులను చేపట్టింది. ఇప్పటివరకు కొత్తగా జీమెయిల్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికీ లభించే 15 జీబీ ఉచిత స్టోరేజ్ పరిమితిని కేవలం 5 జీబీకి తగ్గించేలా ఒక కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
కొత్తగా గూగుల్ ఖాతా సృష్టించుకునే వారు తమ ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేసి వెరిఫై చేయకపోతే కేవలం 5 జీబీ స్టోరేజ్ మాత్రమే లభిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ వేదిక ‘ఆండ్రాయిడ్ అథారిటీ’ ఆధ్వర్యంలో గూగుల్ అధికారికంగా ధ్రువీకరించింది. మొదట ఈ మార్పును ఒక రెడ్డిట్ వినియోగదారుడు గుర్తించి వెలుగులోకి తెచ్చారు.
గూగుల్ వివరణ ఏమిటి?
ఉచిత స్టోరేజ్ పరిమితి తగ్గింపుపై వస్తున్న వార్తలపై గూగుల్ స్పందించింది. ‘అత్యుత్తమ నాణ్యత కలిగిన క్లౌడ్ స్టోరేజ్ సేవలను నిరంతరాయంగా అందించడమే మా లక్ష్యం. అందులో భాగంగానే నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ కొత్త స్టోరేజ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం. దీనివల్ల భద్రత పెరగడమే కాకుండా, డేటా రికవరీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది’ అని గూగుల్ పేర్కొంది.
అయితే, ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తింపజేస్తారా లేదా అనే అంశంపై కంపెనీ ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ నిబంధన కేవలం కొత్తగా క్రియేట్ చేసే ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కొత్త స్టోరేజీ పాలసీ ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా గూగుల్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ వంటి సేవలన్నింటికీ కలిపి ఉమ్మడిగా 15 జీబీ ఉచిత స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ ఎకోసిస్టమ్‌ను వాడటానికి వినియోగదారులను ఆకర్షించే అతిపెద్ద ఫీచర్ ఇదే.
ప్రస్తుత పరీక్షల ప్రకారం..
డిఫాల్ట్ లిమిట్ - 5 జీబీ: కొత్త టెస్ట్ అకౌంట్ సిస్టమ్ కింద సైన్ అప్ అయ్యే వారికి ప్రాథమికంగా 5 జీబీ మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు.
పూర్తి 15 జీబీ పొందాలంటే: కొత్త వినియోగదారులు తప్పనిసరిగా తమ ఫోన్ నంబర్‌ను అందించి ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మిగిలిన 10 జీబీ అన్‌లాక్ అయి మొత్తం 15 జీబీ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది.
ఫోన్ నంబర్ వెరిఫికేషన్ ఎందుకు?
ఒక్కరే వందలాది నకిలీ (ఫేక్) ఖాతాలను సృష్టించి ఉచితంగా లభించే 15 జీబీ స్టోరేజ్ ఆఫర్లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడమే గూగుల్ ప్రధాన ఉద్దేశం. ఫోన్ నంబర్ లింక్ చేయడం ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఉచిత స్టోరేజ్ ప్రయోజనం చేకూరుతుందని గూగుల్ భావిస్తోంది. అంతేకాకుండా వినియోగదారులు ఎప్పుడైనా తమ పాస్‌వర్డ్ మర్చిపోయినా లేదా ఖాతా హ్యాకింగ్‌కు గురైనా.. ఫోన్ నంబర్ ద్వారా సులభంగా రికవర్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
ప్రస్తుతం ఆఫ్రికా వంటి కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాల్లో ఈ మార్పును వినియోగదారులు గమనించారు. భారతదేశంలోనూ కొత్త ఖాతా తెరిచే సమయంలో తప్పనిసరిగా ఫోన్ నంబర్ అడుగుతున్నట్లు కొందరు యూజర్లు సోషల్ మీడియా ద్వారా నివేదిస్తున్నారు.
స్టోరేజీని గూగుల్ నిజంగానే తగ్గిస్తోందా?
ప్రస్తుతానికి గూగుల్ ఈ విధానాన్ని ఒక ప్రయోగంగా మాత్రమే చెబుతోంది తప్ప, ఉచిత స్టోరేజీని శాశ్వతంగా తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నిర్వహణ ఖర్చులు, వాటికి పెరుగుతున్న డిమాండ్ వల్లే టెక్ కంపెనీలు ఉచిత సేవలను పరిమితం చేస్తున్నాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. గూగుల్ దీనిని ధ్రువీకరించలేదు.
ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు!


