’గూగుల్‌’ కేసులో తాత్కాలిక స్టేకు ఎన్‌సీఎల్‌ఏటీ నిరాకరణ

Google Play Store Case: Nclat Refuses Stay On Cci Penalty In Google Case - Sakshi

న్యూఢిల్లీ: ప్లే స్టోర్‌ విధానాలపై కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) జరిమానా విధించిన కేసులో ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించిన టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఊరట దక్కలేదు. దీనిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిరాకరించింది. సీసీఐ విధించిన రూ. 936 కోట్లలో పది శాతాన్ని వచ్చే నాలుగు వారాల్లోగా రిజిస్ట్రీలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది. ప్లే స్టోర్‌ విధానాల్లో గూగుల్‌ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ ఈ పెనాల్టీ విధించింది.

మరోవైపు, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ల విషయంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ గూగుల్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం వాదనలు విననుంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ల విషయంలో గూగుల్‌ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ రూ. 1,337 కోట్లు జరిమానా విధించగా, దానిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ 10 శాతం మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలంటూ ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు కేసులకు సంబంధించి గూగుల్‌కు సీసీఐ మొత్తం రూ. 2,200 కోట్ల మేర జరిమానా విధించింది.

చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న బీఓబీ!

 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top