
2024లో రూ. 4 లక్షల కోట్ల ప్రయోజనం: పబ్లిక్ ఫస్ట్ నివేదిక
న్యూఢిల్లీ: భారత ఎకానమీ వృద్ధికి గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ కూడా ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నట్లు రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ పబ్లిక్ ఫస్ట్ తెలిపింది. 2024లో యాప్ పబ్లిషర్లకు, విస్తృత ఆర్థిక వ్యవస్థకు ఇవి సుమారు రూ. 4 లక్షల కోట్ల మేర ఆదాయ ప్రయోజనం చేకూర్చినట్లు వివరించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఎకానమీల్లో భారత్ కూడా ఒకటని పబ్లిక్ ఫస్ట్ ఒక నివేదికలో వివరించింది.
స్మార్ట్‌ఫోన్ల వినియోగం వేగంగా పెరగడం, డేటా చౌకగా లభిస్తుండటం, డెవలపర్లు.. ఎంట్రప్రెన్యూర్లకు అనువైన పరిస్థితులు నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొంది. రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే, ఆండ్రాయిడ్ యాప్ వ్యవస్థ దాదాపు ముప్పైఅయిదు లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పించింది.
గూగుల్ ప్లేలో నమోదు చేసుకున్న యాక్టివ్ డెవలపర్లకు సంబంధించి 10 లక్షల డెవలపర్ జాబ్స్‌తో భారత్ రెండో స్థానంలో ఉంది. సుమారు 79% మంది యాప్ డెవలపర్లకు విదేశీ యూజర్లు ఉన్నారు. ప్లే స్టోర్ నుంచి భారతీయ డెవలపర్ల యాప్‌ల డౌన్‌లోడ్‌లు 720 కోట్లుగా ఉండగా, ఇందులో దేశీ యూజర్ల డౌన్‌లోడ్‌లు 600 కోట్లు, విదేశీ యూజర్ల డౌన్‌లోడ్‌లు 120 కోట్లుగా నమోదయ్యాయి. ఆండ్రాయిడ్ సర్వీసులకు సంబంధించి గూగుల్ ప్లే అధికారిక యాప్ స్టోర్.