ఐదేళ్లు.. ఐదు లక్షల కోట్లు | Godrej Industries Sets Sight on Rs 5 Lakh Crore Market Cap by 2031 | Sakshi
Sakshi News home page

ఐదేళ్లు.. ఐదు లక్షల కోట్లు

Apr 23 2026 4:58 PM | Updated on Apr 23 2026 6:50 PM

Godrej Industries Sets Sight on Rs 5 Lakh Crore Market Cap by 2031

మార్కెట్‌ క్యాప్‌పై గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ గురి

మరో రెండు కంపెనీల లిస్టింగ్‌

కొత్త బ్రాండ్‌ లోగో ఆవిష్కరణ

ముంబై, సాక్షి బిజినెస్‌ బ్యూరో: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ వచ్చే ఐదేళ్లకు భారీ ప్రణాళికను ప్రకటించింది. 2031 నాటికి రూ. 5 లక్షల కోట్ల మేర దాదాపు రెండింతల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మరో రెండు కంపెనీలను లిస్ట్‌ చేయడం, అన్ని వ్యాపారాల్లో డబుల్‌ డిజిట్‌ వృద్ధి సాధించడం ద్వారా ఈ టార్గెట్‌ చేరుకోవాలని భావిస్తోంది.

సంవత్సరానికి 15 శాతానికి మించి అమ్మకాల వృద్ధి, 20 శాతం కంటే ఎక్కువ ఈపీఎస్‌ వృద్ధి, ప్రతి వ్యాపారంలో 18 శాతం కంటే ఎక్కువ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం గ్రూప్‌ కొత్త బ్రాండ్‌ గుర్తింపు, లోగో ఆవిష్కరణ సందర్భంగా త్వరలో కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న పిరోజ్‌ షా గోద్రెజ్‌ ఈ విషయాలు తెలిపారు. లిస్ట్‌ చేయబోయే సంస్థల్లో గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఉంటుందని చెప్పారు.సస్టైనబిలిటీ, ఉద్యోగుల ప్రాతినిధ్యం అంశాలపై కూడా సంస్థ దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు.

2031 నాటికి మహిళలు, ఎల్‌జీబీక్యూటీ వర్గాలు, దివ్యాంగుల ప్రాతినిధ్యాన్ని 40 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వ్యాపార వృద్ధి వ్యూహంలో భాగంగా, లిస్టెడ్‌ సంస్థలు తమకు అవసరమయ్యే నిధులను తామే సమకూర్చుకుంటాయి. లిస్ట్‌ కాని వ్యాపారాల్లో వచ్చే ఐదేళ్లలో రూ. 5,000 నుంచి రూ. 7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని గోద్రెజ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement