ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని, అది ఆహార ధరలను పెంచుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు కీలక సంస్థలు ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా విడుదల చేసిన ఉమ్మడి నివేదికలో హెచ్చరికలు జారీ చేశాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు ప్రపంచ ఆహార వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, దీనివల్ల వంద కోట్ల మంది ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
గ్లోబల్ వార్మింగ్
వాతావరణ మార్పుల ధాటికి పంటలు, పశువులు, మత్స్య సంపద, అడవులు విలవిలలాడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వేగవంతం కావడంతో 2025వ సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి కలిగిన మొదటి మూడు సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది.
నివేదికలోని అంశాలు..
ప్రధాన పంటల దిగుబడిపై ఉష్ణోగ్రత ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు దాటితే మొక్కల ఎదుగుదల మందగిస్తుంది.
ప్రపంచ సగటు ఉష్ణోగ్రతపై పెరిగే ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ మన ప్రధాన ఆహార వనరులైన మొక్కజొన్న, వరి, సోయా, గోధుమల దిగుబడిని దాదాపు 6% మేర తగ్గిస్తుంది.
మొరాకో ఉదాహరణ: ఆరేళ్ల కరువు తర్వాత అక్కడ సంభవించిన వడగాల్పుల వల్ల తృణధాన్యాల దిగుబడి 40% పడిపోయింది. ఆలివ్, సిట్రస్ తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
సముద్రాల్లో సెగలు
నేల మీద మాత్రమే కాదు, సముద్ర గర్భంలోనూ వేడి సెగలు పుడుతున్నాయి. 2024లో ప్రపంచ మహాసముద్రాల్లో 91% భాగానికి పైగా కనీసం ఒక్కసారైనా మెరైన్ హీట్ వేవ్(సముద్రపు వడగాల్పులు) సంభవించింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి చేపల నిల్వలు క్షీణిస్తున్నాయి. ఇది మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది.
పరిష్కారం ఏమిటి?
వాతావరణ మార్పుల సమాచారాన్ని నేరుగా రైతుల చేతుల్లోకి (మొబైల్స్ ద్వారా) చేరవేయాలి. తద్వారా పంటలు వేసే సమయాన్ని, కోత సమయాన్ని సర్దుబాటు చేసుకోగలరు.
ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.
కేవలం తాత్కాలిక సర్దుబాట్లు సరిపోవని, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నివేదిక నొక్కి చెప్పింది.
అన్నదాత ఆవేదన, ప్రకృతి ఆగ్రహం కలిసి ప్రపంచ ఆహార భద్రతను అంచుకు నెట్టేస్తున్నాయి. మనం ఇప్పుడే మేల్కొని పర్యావరణ హితమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఆహార కొరత తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరికల సారాంశం.
ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!


