గ్లాండ్‌ ఫార్మా ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

Gland pharma got SEBI nod to to go public - Sakshi

చైనీస్‌ మాతృ సంస్థ కలిగిన తొలి ఫార్మా కంపెనీ

ఫోజన్‌ గ్రూప్‌నకు అనుబంధ కంపెనీ

నవంబర్‌కల్లా పబ్లిక్‌ ఇష్యూకి గ్లాండ్‌ ఫార్మా

ఐపీవో ద్వారా రూ. 6,000 కోట్ల సమీకరణ లక్ష్యం

ఎరిస్‌ లైఫ్‌సైన్స్‌ తదుపరి ఐపీవోకు వస్తున్న ఫార్మా కంపెనీ

ఇంజక్టబుల్‌ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్‌ ఫార్మా పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫార్మా రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో నవంబర్‌కల్లా గ్లాండ్‌ ఫార్మా ఐపీవోను చేపట్టవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా చైనీస్‌ కంపెనీ మాతృ సంస్థగా కలిగిన గ్లాండ్‌ ఫార్మా తొలిసారి దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా రూ. 6,000 కోట్లను సమీకరించాలని గ్లాండ్‌ ఫార్మా భావిస్తోంది. మార్చి పతనం తదుపరి కొద్ది రోజులుగా స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతుండటంతో పలు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వస్తున్న విషయం విదితమే. అయితే గత మూడు సంవత్సరాలలో దేశీయంగా ఒక్క ఫార్మా కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూకి రాకపోవడం గమనార్హం! ఇంతక్రితం 2017 జూన్‌లో ఎరిస్‌ లైఫ్‌సైన్స్‌ లిస్టయ్యాక తిరిగి గ్లాండ్‌ ఫార్మా ఐపీవో బాట పట్టినట్లు నిపుణులు తెలియజేశారు.

కంపెనీ వివరాలు..
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లాండ్‌ ఫార్మాకు మాతృ సంస్థ చైనీస్‌ ఫోజన్‌ గ్రూప్‌. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ ఫోజన్‌ గ్రూప్‌ కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. రూ. 4,750 కోట్ల విలువైన వాటాతోపాటు.. తాజాగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌లో లిస్టయిన ఫోజన్‌ గ్రూప్‌ 2017 అక్టోబర్‌లో 1.09 బిలియన్‌ డాలర్లకు గ్లాండ్‌ ఫార్మాలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. 1978లో పీవీఎన్‌ రాజు కంపెనీని ఏర్పాటు చేశారు. 1999 నుంచీ డాక్టర్‌ రవి పెన్మెత్స వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తదుపరి 2019లో యాజమాన్యానికి సలహాదారునిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా శ్రీనివాస్‌ ఎస్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఫార్మా ప్రొడక్టులు
గ్లాండ్‌ ఫార్మా ప్రధానంగా జనరిక్‌ ఇంజక్టబుల్‌ ఫార్మా ప్రొడక్టులను రూపొందిస్తోంది. కంపెనీ యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్ల నుంచి అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్‌, యాంటీ మలేరియా, యాంటీ ఇన్‌ఫెక్టివ్స్‌, కార్డియాక్‌, గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండెపోటు, తదితర సమయాలలో చేసే సర్జరీలలో వినియోగించే హెపరిన్‌ తయారీలో కంపెనీ పేరొందింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top