టారిఫ్‌ల సవరణ: గ్యాస్‌ షేర్లు రయ్‌రయ్‌

Gas pipeline tariff - Sakshi

గ్యాస్‌ పైప్‌లైన్‌ టారిఫ్‌ల సరళీకరణ ఎఫెక్ట్‌

15 శాతం దూసుకెళ్లిన ఇంద్రప్రస్థ గ్యాస్‌

14 శాతం జంప్‌చేసిన మహానగర్‌ గ్యాస్‌

అదే బాటలో గుజరాత్‌ గ్యాస్‌, జీఎస్‌పీఎల్‌, అదానీ గ్యాస్‌

ముంబై, సాక్షి: గ్యాస్‌ రవాణా టారిఫ్‌లకు సంబంధించి పెట్రోలియం, సహజవాయు నియంత్రణ సంస్థ(పీఎన్‌జీఆర్‌బీ) తాజాగా సవరణలు ప్రకటించింది. యూనిఫైడ్‌ గ్యాస్‌ ప్రసార టారిఫ్‌లను సరళీకరిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. రెండు జోన్ల స్ట్రక్చర్‌ ఆధారంగా గ్యాస్‌ లభ్యత, దూరాలకు అనుగుణంగా సవరణలు చేపట్టింది. తద్వారా దూరప్రాంత వినియోగదారులకు ఇంధన ధరలు తగ్గే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గ్యాస్‌ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెరుగుతాయని తెలియజేశాయి. జాతీయ గ్రిడ్‌కు అనుసంధానమైన సుమారు 12 పైప్‌లైన్లకు సంబంధించి యూనిఫైడ్‌ టారిఫ్‌ల సరళీకరణకు పీఎన్‌జీఆర్‌బీ తెరతీసినట్లు వివరించాయి. దీంతో గ్యాస్‌ పంపిణీ‌ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కంపెనీల షేర్లన్నీ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (మార్కెట్లు వీక్‌- షుగర్‌ షేర్లు స్వీట్‌)

యమస్పీడ్‌..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌(జీఎస్‌పీఎల్)‌, అదానీ గ్యాస్‌, మహానగర్‌ గ్యాస్‌, గుజరాత్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌ కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ సందడి చేస్తున్నాయి. తొలుత రూ. 228ను అధిగమించిన జీఎస్‌పీఎల్‌ షేరు ప్రస్తుతం 9.25 శాతం ఎగసి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఇంద్రప్రస్థ గ్యాస్‌ 13 శాతం దూసుకెళ్లి రూ. 505 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515కు చేరింది. ఇక తొలుత రూ. 1,058కు చేరిన మహానగర్‌ గ్యాస్‌ 12.4 శాతం జంప్‌చేసి రూ. 1,044 వద్ద కదులుతోంది. అదానీ గ్యాస్‌ తొలుత 9 శాతం వృద్ధితో రూ. 345కు చేరింది. ప్రస్తుతం 4.3 శాతం లాభంతో రూ. 330 వద్ద ట్రేడవుతోంది. ఇదేవిధంగా గుజరాత్‌ గ్యాస్‌ 5 శాతం బలపడి రూ. 360 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో దాదాపు 20 శాతం పురోగమించి రూ. 412ను దాటేసింది. కాగా.. గెయిల్‌ షేరు 1 శాతం లాభంతో రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107కు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top