ముకేశ్‌ చేతికి ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైలింగ్‌!

Future enterprises may seal deal with Reliance industries - Sakshi

శనివారం ఫ్యూచర్‌ గ్రూప్‌ బోర్డు సమావేశం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో డీల్‌కు ఆమోదం?

ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రిటైల్‌ బిజినెస్‌ విక్రయం

రిలయన్స్‌ రిటైల్‌ గొడుగు కిందకు ఫ్యూచర్‌ రిటైలింగ్‌

ప్రస్తుతం ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లకు భారీ డిమాండ్‌

కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌  గ్రూప్‌ శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రిటైల్‌ బిజినెస్‌ను బిలియనీర్‌ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు విక్రయించే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో నగదు రూపేణా డీల్‌ కుదుర్చుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. డీల్‌ విలువ రూ. 30,000 కోట్లవరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

ఒకే సంస్థగా..
రుణ భారంతో కొద్ది రోజులుగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్‌ గ్రూప్‌ ఇటీవల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో చర్చలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తద్వారా రిటైల్‌ బిజినెస్‌ను ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ దిగ్గజం ఆర్‌ఐఎల్‌కు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. డీల్‌పై అంచనాలు ఎలా ఉన్నాయంటే..  తొలుత గ్రోసరీ, దుస్తులు, సప్లై చైన్‌, కన్జూమర్‌ బిజినెస్‌లతో కూడిన ఐదు లిస్టెడ్‌ కంపెనీలు ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనం కానున్నాయి. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రస్తుతం గ్రూప్‌నకు చెందిన రిటైల్‌ బ్యాకెండ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెరసి ఫ్యూచర్‌ రిటైల్‌, లైఫ్‌స్టైల్‌, సప్లై చైన్‌, మార్కెట్స్‌ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనంకానున్నట్లు అంచనా. విలీనం తదుపరి మొత్తం రిటైల్‌ ఆస్తులను ఒకే యూనిట్‌గా ఆర్‌ఐఎల్‌కు విక్రయించనుంది.

చెల్లింపులు ఇలా!
పరిశ్రమవర్గాల అంచనా ప్రకారం రిలయన్స్‌ తొలుత రూ. 13,000 కోట్లను ఫ్యూచర్‌ గ్రూప్‌ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మరో రూ. 7,000 కోట్లను భూయజమానులు, వెండార్స్‌కు చెల్లించనుంది. మరో రూ. 7,000 కోట్లవరకూ ప్రమోటర్‌ గ్రూప్‌నకు విడుదల చేసే అవకాశముంది. తదుపరి దశలో రూ. 3,000 కోట్లు వెచ్చించడం ద్వారా ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో 16 శాతం వరకూ వాటాను సొంతం చేసుకోనుంది. ఫ్యూచర్‌ కన్జూమర్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్టులు, టెక్స్‌టైల్‌ మిల్స్‌, బీమా విభాగాలను ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కలిగి ఉండవచ్చని అంచనా. ఫుడ్‌, ఫ్యాషన్‌ సరఫరాలకు వీలుగా ఆర్‌ఐఎల్‌తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కుదుర్చుకోనుంది. ఈ వివరాలపై రెండు కంపెనీలూ స్పందించేందుకు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.

షేర్ల జోరు
బోర్డు సమావేశం నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్‌ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీలన్నీ లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫ్యూచర్‌ రిటైల్‌ 4.3 శాతం జంప్‌చేసి రూ. 136కు చేరగా.. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ 4.7 శాతం ఎగసి రూ. 145ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 2 శాతం ఎగసి రూ. 19.6 వద్ద, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ 2 శాతం బలపడి రూ. 151 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 26.65 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్‌ కన్జూమర్‌ 2 శాతం పుంజుకుని రూ. 11.15 వద్ద కదులుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top