ఎఫ్‌ఐఈవో, బిజినెస్‌ రష్యా ఎంవోయూ

FIEO, Business Russia ink MoU to promote trade, investments - Sakshi

వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై దృష్టి

న్యూఢిల్లీ: భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో), బిజినెస్‌ రష్యాతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహం ఇచ్చిపుచ్చుకోనున్నట్టు తెలిపింది. రష్యా వ్యాపార మండలి, ఎఫ్‌ఐఈవో సంయుక్తంగా ఎగ్జిబిషన్లు, కొనుగోలుదారులు–విక్రయదారుల సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు ఏర్పాటు చేయడంతోపాటు, జాయింట్‌ వెంచర్ల ఏర్పాటు విషయంలో తమ దేశ సంస్థలకు సహకారం అందించనున్నాయి. ఆగ్రో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందిన 50 మంది భారత ప్రతినిధుల బృందం మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఎంవోయూ కుదిరింది.

రెడీ టూ ఈట్‌ మీల్స్, ఫిష్‌ మీల్, జంతువులకు దాణా, సోయాబీన్‌ తదితర ఉత్పత్తుల విషయంలో జాయింట్‌ వెంచర్ల ఏర్పాటుపై ప్రతినిధుల బృందం దృష్టి పెట్టనున్నట్టు ఎఫ్‌ఐఈవో బోర్డ్‌ సభ్యుడు ఎన్‌కే కగ్లివాల్‌ తెలిపారు. భారత ప్రతినిధుల బృందానికి కగ్లివాల్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఆగ్రో, ఆహార ప్రాసెసింగ్‌ ఎగుమతులు 750 మిలియన్‌ డాలర్ల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు వచ్చే మూడేళ్లలో పెంచుకోవాలన్నది లక్ష్యమని తెలిపారు. కొన్ని అంశాల పరిష్కారానికి ఎగుమతిదారులు, దిగుమతిదారులు, బ్యాంకర్ల అదనపు కృషి చేయాల్సి ఉంటుందని ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top