డిస్కౌంట్ల పండగొచ్చింది..!

Festival of discounts starts on this seasons - Sakshi

ఎలక్ట్రానిక్స్‌ నుంచి నిత్యావసరాల వరకు ఆఫర్లు

వ్యయాలు తగ్గడంతో కస్టమర్లకు బదిలీ

5–8 శాతం తగ్గిన టీవీల ధరలు

స్మార్ట్‌ఫోన్లపై 4–5 శాతం డిస్కౌంట్‌

ల్యాప్‌టాప్‌లపై 2,000 వరకు ఆఫర్‌

న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్‌ సేల్స్‌ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్‌ గూడ్స్‌ అయిన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్‌జీ, శాంసంగ్, సోనీ  టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్‌టాప్‌ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  

నూనెలు సైతం..  
నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్‌ ప్యాక్‌ల ధరలపై ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్‌ ప్యాక్‌లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్‌ సెల్‌ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top