అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విందులో ఒక ఆసక్తికరమైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలై యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య కూర్చున్న ఒక చైనా మహిళ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. దాంతో తనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఆమె.. చైనాలోనే అత్యంత ప్రతిభావంతురాలైన స్వయంకృషి గల మహిళా పారిశ్రామికవేత్త, ‘లెన్స్ టెక్నాలజీ’ వ్యవస్థాపకురాలు జౌ కున్ఫీ. తన కంపెనీకి అత్యంత కీలకమైన ఇద్దరు గ్లోబల్ కస్టమర్ల మధ్య ఆమె కూర్చోవడం టెక్ ప్రపంచంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
అట్టడుగు స్థాయి నుంచి బిలియనీర్ వరకు..
టెక్ దిగ్గజాల మధ్య సముచిత స్థానం సంపాదించుకున్న జౌ కున్ఫీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆమె ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు..
1970లో హునాన్ ప్రావిన్స్‌లోని ఒక పేద గ్రామంలో జన్మించిన జౌ, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కేవలం 15 ఏళ్ల వయసులోనే చదువు మానేశారు. బతుకుదెరువు కోసం షెన్‌జెన్ నగరానికి వలస వెళ్లి అక్కడి ఫ్యాక్టరీల్లో కార్మికురాలిగా పనిచేశారు.
1993లో, 23 ఏళ్ల వయసులో తన బంధువుల సహాయంతో కొంత మూలధనాన్ని సమకూర్చుకుని బావోన్ జిల్లాలోని ఒక నివాస భవనంలో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. రిస్ట్ వాచ్ గ్లాస్‌లపై స్క్రీన్ ప్రింటింగ్ చేయడంతో ఆమె వ్యాపార ప్రస్థానం మొదలైంది.
ఆ తర్వాత దశాబ్ద కాలానికి, ఆమె కష్టార్జితంతో ‘లెన్స్ టెక్నాలజీ’ సంస్థ రూపుదిద్దుకుంది.
యాపిల్‌తో భాగస్వామ్యం
2007లో స్మార్ట్‌ఫోన్ రంగాన్నే విప్లవాత్మకంగా మార్చేసిన ఐఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన తరుణంలో లెన్స్ టెక్నాలజీకి అదృష్టం వరించింది. ఐఫోన్ స్క్రీన్ కవర్ గ్లాస్ సరఫరాదారుగా యాపిల్ సప్లై చైన్‌లో లెన్స్ టెక్నాలజీ చోటు దక్కించుకుంది. ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు విక్రయాలు సాధించడంతో యాపిల్ సంస్థ లెన్స్‌కు అతిపెద్ద కస్టమర్‌గా మారింది. 2010ల ప్రారంభం నాటికి లెన్స్ టెక్నాలజీ వార్షిక ఆదాయంలో సగానికి పైగా వాటా యాపిల్ నుంచే రావడం విశేషం.
ఈ విజయంతో మార్చి 2015లో షెన్‌జెన్‌లోని ‘చినెక్స్ట్ ఇండెక్స్’లో లెన్స్ నమోదైంది. తద్వారా జౌ కున్ఫీ చైనాలోనే అత్యంత ధనవంతురాలైన సెల్ఫ్-మేడ్ మహిళగా అవతరించారు. అనంతరం 2025లో ఈ సంస్థ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పబ్లిక్ లిస్టింగ్ సాధించింది.
మస్క్ కంపెనీలతో బంధం
2016 నుంచి టెస్లా సంస్థతో ప్రారంభమైన అనుబంధం లెన్స్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. స్మార్ట్-కాక్‌పిట్, బాహ్య నిర్మాణ విడిభాగాల తయారీలో గ్లాస్, మెటల్, టచ్ మాడ్యూల్స్ విభాగాల్లో లెన్స్ తన నైపుణ్యాన్ని చాటుకుంది. గత డిసెంబర్‌లో ఇన్వెస్టర్ల వేదికగా లెన్స్ టెక్నాలజీ ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఒక ప్రధాన ఉత్తర అమెరికా కస్టమర్‌తో తాము దశాబ్ద కాలంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఆ కస్టమర్ ప్రధాన వ్యాపారాలైన స్మార్ట్ కాక్‌పిట్‌లు, హ్యూమనాయిడ్ రోబోట్‌లు (ఆప్టిమస్), కమర్షియల్ ఏరోస్పేస్ (స్పేస్‌ఎక్స్)ల్లో తాము భాగస్వాములుగా ఉన్నట్లు పేర్కొంది. శాటిలైట్ గ్రౌండ్ రిసీవర్ల కోసం బాహ్య నిర్మాణాత్మక మాడ్యూల్స్, అంతరిక్ష ప్రయోగాల కోసం అల్ట్రా-థిన్ ఫోటోవోల్టాయిక్ గ్లాస్ మాడ్యూల్స్‌ను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కంపెనీ పేరు అధికారికంగా వెల్లడించనప్పటికీ అది ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్లోబల్ టెక్ మహారథులైన టిమ్ కుక్, ఎలాన్ మస్క్‌ల నమ్మకాన్ని గెలుచుకున్న జౌ కున్ఫీ రాబోయే రోజుల్లో ఏఐ హార్డ్‌వేర్ తయారీ వ్యూహాలతో ముందుకెళ్లనున్నారు.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు


