మార్కెట్‌లో స్థిరీకరణకు అవకాశం

Expert Opinion On This Week Market Trend From Nov 8 to 12 - Sakshi

స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల ఫలితాలపై దృష్టి 

పరిమిత శ్రేణిలో ట్రేడింగ్‌ జరగొచ్చు 

మూడు ఐపీఓలు.., రెండు లిస్టింగ్‌లు 

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ    

ముంబై: స్టాక్‌ సూచీలు ఈ వారం పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ.., స్థిరీకరణ దిశగా సాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ పరిణామాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని చెబుతున్నారు. అలాగే స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కీలకం కానున్నాయని వారంటున్నారు.
ప్రపంచ పరిణామాలు, ఎఫ్‌ఐఐల వైఖరి కీలకం 
 ‘‘ప్రపంచ మార్కెట్ల మిశ్రమ వైఖరితో దేశీయ స్టాక్‌ సూచీల గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోవచ్చు. కార్పొరేట్ల రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి సారించడం శ్రేయస్కరం. సాంకేతికంగా నిఫ్టీ తన 50 రోజుల సగటు తక్షణ మద్దతు 17,674 స్థాయిని నిలుపుకోగలిగింది. అప్‌సైడ్‌లో 18,000–18,200 శ్రేణి మధ్య బలమైన నిరోధాన్ని ఎదుర్కోనుంది’’ రిలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.  
గత వారంలో సెన్సెక్స్‌ 761 పాయింట్లు, నిఫ్టీ 245 పాయింట్లు లాభపడ్డాయి.  
కార్పొరేట్ల క్వార్టర్‌ ఫలితాలపై దృష్టి...  
కార్పొరేట్ల రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఈ వారంలో 2,100 పైగా కంపెనీలు తమ క్యూ2 ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. బ్రిటానియా, అరబిందో, భాష్, ఎంఅండ్‌ఎం, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, జొమాటో, టాటా స్టీల్, కోల్‌ ఇండియా, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో, ఓఎన్‌జీసీ లు సెప్టెంబర్‌ త్రైమాసిక గణాంకాలను వెల్లడించే కంపెనీల జాబితాలో ఉన్నాయి.  
బేరీష్‌గా విదేశీ ఇన్వెస్టర్లు...  
వరుసగా మూడోవారంలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీయ ఈక్విటీలను అమ్మేందుకే మొగ్గు చూపారు. గత నెల ఆక్టోబర్‌లో రూ.13550 కోట్ల షేర్లను షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు తాజాగా ఈ నవంబర్‌ ఇప్పటి వరకు రూ.4,583 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. రానున్న రోజుల్లో ఇదే వైఖరి కొనసాగితే మార్కెట్లో కరెక్షన్‌ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. 
స్థూల ఆర్థిక గణాంకాలు కీలకం....  
అమెరికా, చైనాలు బుధవారం(10న) ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఆర్థికంగా అగ్ర రాజ్యాలైన ఈ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మక, కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. అలాగే పలు దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపు, పెంపు అంశాలను సైతం ఈ గణాంకాలు ప్రభావితం చేయగలవు. ఇక దేశీయంగా శుక్రవారం(నవంబర్‌ 12న) దేశీయ సెప్టెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు రిటైల్‌ ద్రవ్యోల్బణ డేటా విడుదల అవుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top