ఇంజనీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతుల్లో రికార్డు

Engineering goods exports record positive growth, says EEPC - Sakshi

మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 27 శాతం

ఈఈపీసీ చైర్మన్‌ మహేశ్‌ దేశాయ్‌

కోల్‌కతా: ఇంజనీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతుల్లో రికార్డు నెలకొన్నట్లు ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక వ్యవహారాల మండలి (ఈఈపీసీ) చైర్మన్‌ మహేశ్‌ దేశాయ్‌ వెల్లడించారు.  2021 సెప్టెంబర్‌లో  ఇంజనీరింగ్‌ వస్తువుల ఎగుమతులు తొమ్మిది బిలియన్‌ డాలర్లను దాటాయి. 

ఎగుమతులకు సంబంధించి మొత్తం 25 ప్రధాన దేశాలకు సంబంధించి 22 దేశాల విషయంలో మంచి సానుకూల గణాంకాలు వెలువడినట్లు వివరించారు. ఇందులో చైనా,  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ), జర్మనీ, టర్కీ, ఇటలీ, బ్రిటన్, మెక్సికో, వియత్నాం, సింగపూర్‌ వంటి దేశాలు ఉన్నాయన్నారు. మొత్తం భారత్‌ ఎగుమతుల్లో ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల వాటా 26.65 శాతం.  

2022 మార్చి నాటికి 105 బిలియన్‌ డాలర్ల లక్ష్యం
2021 ఏప్రిల్‌ నుంచి 2021 సెప్టెంబర్‌ వరకూ చూస్తే, భారత్‌ ఇంజనీరింగ్‌ ఎగుమతుల విలువ 32.4 బిలియన్‌ డాలర్ల నుంచి 52.3 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు ఈఈపీసీ చైర్మన్‌ వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో (2022 మార్చి నాటికి) 49 శాతం వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, లక్ష్యం సాకారమైతే ఇంజనీరింగ్‌ గూడ్స్‌ ఎగుమతుల విలువ 105 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరు దేశాలు,  ట్రేడింగ్‌ బ్లాక్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) వేగవంతం చేయడానికి కేంద్రం చేస్తున్న కృషిని దేశాయ్‌ స్వాగతించారు. 

అయితే ఇటువంటి ముందస్తు ఒప్పందాల వల్ల చోటుచేసుకున్న ప్రతికూల ప్రభావాలపై కూడా  ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.  ‘‘ముందస్తు సంతకం చేసిన ఎఫ్‌టీఏ వల్ల కొరియా,  జపాన్‌ వంటి దేశాల నుండి ఫెర్రస్, నాన్‌–ఫెర్రస్‌ రంగాలలోని కొన్ని వస్తువుల దిగుమతులు గణనీయంగా పెరిగిపోయాయి. అందువల్ల కొత్త ఎఫ్‌టీఏలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు. భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top