
కొత్త మోడల్స్ ఎంట్రీతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్‌ఈఈ) సరఫరా సమస్యలు సకాలంలో పరిష్కారమైతే, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని కేర్‌ఎడ్జ్ అడ్వైజరీ ఒక నివేదికలో తెలిపింది. 2028 నాటికి దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడమనేది, చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా ఆధారపడి ఉంటుందని కేర్‌ఎడ్జ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ తన్వి షా తెలిపారు. ఈవీల వినియోగం పెరగడానికి ప్రధాన అవరోధంగా ఉంటున్న చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.
దేశీయంగా 2022 క్యాలెండర్ ఇయర్‌లో 5,151గా ఉన్న పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో 26,000కు చేరినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,000 యూనిట్ల స్థాయిలో నమోదైన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07 లక్షల యూనిట్లకు చేరాయి. సాధారణంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఫోర్ వీలర్ల వాటా చాలా తక్కువగానే ఉంటుంది.