డాక్డర్‌ రెడ్డీస్‌ నికర లాభం డౌన్

Dr Reddys lab net profit down - Sakshi

క్యూ2(జులై- ఆగస్ట్‌)లో రూ. 762 కోట్లు

కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 30 శాతం మైనస్‌

2 శాతం పెరిగిన మొత్తం ఆదాయం

నామమాత్ర నష్టంతో కదులుతున్న షేరు

ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్‌)లో నికర లాభం​30 శాతం క్షీణించి రూ. 762 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 4,897 కోట్లను తాకింది. ఇబిటా 11 శాతం తక్కువగా రూ. 1,276 కోట్లుగా నమోదైంది. కాగా.. త్రైమాసిక ప్రాతిపదికన నికర లాభం 32 శాతం పుంజుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్‌ పేర్కొంది. ఇదేవిధంగా ఆదాయంలో 11 శాతం వృద్ధి సాధించినట్లు తెలియజేసింది. ఈ నెల 22న కంపెనీపై సైబర్‌ అటాక్‌ జరిగిన నేపథ్యంలో అన్ని కీలక కార్యకలాపాలనూ తగిన నియంత్రణతో తిరిగి ప్రారంభించినట్లు తెలియజేసింది. 

షేరు ఓకే
ఫలితాల నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 1 శాతం వెనకడుగుతో రూ. 5,053 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 5,150 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 4,990 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. కాగా.. ఈ ఏడాది క్యూ2లో అన్ని మార్కెట్లలోనూ వృద్ధిని సాధించగలిగినట్లు ఫలితాల విడుదల సందర్భంగా డాక్టర్‌ రెడ్డీస్‌ సహచైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. ప్రొడక్టివిటీ మెరుగుపడటంతో ఆర్‌వోసీఈ బలపడినట్లు తెలియజేశారు. కోవిడ్‌-19కు ఇప్పటికే విడుదలైన ప్రొడక్టులకుతోడు తమ రీసెర్చ్‌ టీమ్‌ మరిన్ని ఉత్పత్తులు, నివారణ పద్ధతులపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. 

మార్జిన్లు వీక్‌
క్యూ2లో డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్ స్థూల మార్జిన్లు 3.6 శాతం క్షీణించి 53.9 శాతానికి చేరగా.. నికర లాభ మార్జిన్లు 22.8 శాతం నుంచి 15.6 శాతానికి బలహీనపడ్డాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధి వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 436 కోట్లకు చేరగా.. గ్లోబల్‌ జనరిక్స్‌ బిజినెస్‌ 21 శాతం ఎగసి రూ. 3,984 కోట్లను అధిగమించింది. అయితే ప్రొప్రీటరీ ప్రొడక్టుల ఆదాయం 92 శాతం క్షీణించి రూ. 62 కోట్లను తాకింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top