మారుమూల ప్రాంతాలకూ డిజిటల్‌ సేవలు

Digital services to rural areas - Sakshi

స్పేస్‌ టెక్నాలజీ, టెలికంతో సాధ్యం

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌

న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాలకు డిజిటల్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ టెక్నాలజీ, టెలికం సాంకేతికల మేళవింపు తోడ్పడగలదని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. దీనితో సమ్మిళిత వృద్ధి సాధ్యపడగలదని పేర్కొన్నారు.  అంతరిక్ష టెక్నాలజీలు, ఉపగ్రహ కంపెనీల సమాఖ్య ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌పీఏ) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాలు, ఎడారి గ్రామాలు మొదలైన ప్రాంతాలకు సంప్రదాయ విధానాల్లో డిజిటల్‌ సేవలను చేర్చడం కష్టం. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు స్పేస్‌ టెక్నాలజీలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నా‘ అని ఆయన వివరించారు.  

స్పెక్ట్రంపై తగు సూచనలివ్వండి..
స్పెక్ట్రం నిర్వహణ తదితర అంశాల విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించిన విధానాల రూపకల్పనకు తగు సిఫార్సులు చేయాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. స్పెక్ట్రం విషయంలో స్పేస్, టెలికం రంగాలు రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమైనవేనని ఆయన చెప్పారు. ఫైబర్, టెలికం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సంక్షోభాల నిర్వహణ, ప్లానింగ్, రైళ్ల రాకపోకల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి భారతీయ రైల్వేస్‌.. ఎక్కువగా స్పేస్‌ టెక్నాలజీలనే వినియోగిస్తోందని వైష్ణవ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేస్‌ విభాగం మరింత సమర్ధమంతంగా పనిచేసేందుకు ఉపయోగపడే సాధనాల గురించి రైల్వే, స్పేస్‌ విభాగాల అధికారులతో చర్చించి, అధ్యయనం చేయాలని, తగు పరిష్కార మార్గాలు సూచించాలని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌పీఏ ఆవిషఅకరణతో పరిశ్రమ, రీసెర్చ్‌ సంస్థలు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు, తయారీ సంస్థలు, రైల్వేస్‌ వంటి సర్వీస్‌ సంస్థలు మొదలైన వాటికి కొత్త అవకాశాలు లభించగలవని వైష్ణవ్‌ చెప్పారు.  

త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి..
స్పేస్‌ టెక్నాలజీ రంగంలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించాలని, నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు వేగవంతమయ్యేలా చూడాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సరి చేయాలని స్పేస్‌ సంస్థలు కోరాయి. తక్కువ వ్యయాల భారంతో రుణాలు లభించేలా తోడ్పాటు అందించాలని స్టార్టప్‌ సంస్థలు, చిన్న.. మధ్య తరహా కంపెనీలు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. ‘చాలా మటుకు అనుమతుల ప్రక్రియలు మందకొడిగా సాగుతున్నాయి. అనుమతులు లభించడానికి ఏడాదిన్నర పైగా పట్టేస్తోంది. మీరు వ్యక్తిగతంగా ఈ రంగాన్ని పర్యవేక్షించాలని కోరుతున్నాం. పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు మీరు పరిశీలిస్తుంటే, పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది‘ అని ప్రధానితో ఆన్‌లైన్‌లో పరిశ్రమ వర్గాలు నిర్వహించిన చర్చల సందర్భంగా భారతి ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ తదితరులు కోరారు.

దిగ్గజాలకు సభ్యత్వం..
ఐఎస్‌పీఏ తొలి చైర్మన్‌గా ఎల్‌అండ్‌టీ నెక్సŠట్‌ సీనియర్‌ ఈవీపీ జయంత్‌ పాటిల్‌ చైర్మన్‌గాను, భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ రెగ్యులేటరీ ఆఫీసర్‌ రాహుల్‌ వత్స్‌ వైస్‌ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. అంతరిక్ష, శాటిలైట్‌ టెక్నాలజీ దిగ్గజాలు లార్సన్‌ అండ్‌ టూబ్రో, భారతి ఎయిర్‌టెల్, నెల్కో (టాటా గ్రూప్‌), మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్, వన్‌వెబ్, అనంత్‌ టెక్నాలజీ మొదలైనవి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రెజ్, బీఈఎల్‌ తదితర సంస్థలకు సభ్యత్వం ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top