‘‘పాన్‌’’ కంపల్సరీ.. కాదంటే కుదరదు..

Details About New Rules About PAN In Financial Transactions - Sakshi

రాను రాను పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ లేకపోయినా, వాడకపోయినా, పేర్కొనకపోయినా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నోసార్లు మనం ప్రస్తావించాం. ఏయే సందర్భాల్లో పాన్‌ని తెలియజేయాలో .. ఇప్పుడు అదే దిశలో ఆదాయపు పన్ను శాఖ మరో పెద్ద ముందడుగు వేసింది. 

మే 10వ తేదీన ఒక నోటిఫికేషన్‌ వచ్చింది. అందులో పేర్కొన్న నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయి. ఆ మార్పులు, చేర్పుల సారాంశం ఏమిటంటే .. కొన్ని నిర్దేశిత వ్యవహారాలకు నిర్దిష్ట పరిమితులను పొందుపర్చారు. ఆ లావాదేవీలు చేసే ముందు విధిగా పాన్‌ లేదా ఆధార్‌ గురించి ప్రస్తావించాలి. ఈ లావాదేవీలు ఏ సంస్థతో జరుపుతారో ఆ సంస్థ పాన్‌ / ఆధార్‌తో పాటు ఆ వ్యక్తి యొక్క ‘‘వివరాలు’’ (ఉదాహరణకు వయస్సు, లింగభేదం, చదువు, జాతీయత, మతం మొదలైనవి) అడిగే అవకాశం ఉంది. డెమోగ్రాఫిక్‌ సమాచారంలో అన్ని వివరాలు అడగవచ్చు. బయోమెట్రిక్‌ సమాచారం కూడా అడుగుతారు. అంటే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు.  

నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు ఏమిటంటే.. 
- ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు లేదా ఇతర డిపాజిట్లకు సంబంధించి ఒకటి లేదా ఎన్ని బ్యాంకు ఖాతాల్లోనైనా లేదా పోస్టాఫీసులో రూ. 20,00,000 లేదా అంతకన్నా ఎక్కువ డిపాజిట్‌ చేస్తే, డిపాజిట్‌దారు పాన్‌/ఆధార్‌ సంఖ్య వేయాలి. పుచ్చుకున్న బ్యాంకు/పోస్టాఫీసు ముందుగా పేర్కొన్నట్లు ఆదాయపు పన్ను శాఖలోని ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారాన్ని అందించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక బ్రాంచ్‌ కాదు.. ఒక బ్యాంకు కాదు అన్ని బ్యాంకుల్లోనూ ఎక్కడ డిపాజిట్‌ చేసినా ఈ రూలు వర్తిస్తుంది.  
- ఇదే మాదిరిగా బ్యాంకు నుంచి, పోస్టాఫీస్‌ నుంచి మనం చేసే విత్‌డ్రాయల్స్, అకౌంట్‌ నుంచి .. ఒకసారి కాదు అనేక దఫాలుగా ఒక ఆర్థిక సంవత్సరంలో తీసినది, డెబిట్‌ అయినది, నగదు విత్‌డ్రాయల్‌ కాకుండా చెక్, బదిలీ ద్వారా విత్‌డ్రా చేసినది ఇలాంటి వాటన్నింటికీ కలిపి మొత్తం పరిమితి రూ. 20,00,000గాఉంటుంది. ఇటువంటి సందర్భంలోనూ అవే రూల్సు వర్తిస్తాయి. 
- బ్యాంకులో కరెంటు అకౌంటు తెరిచినా, క్యాష్‌ క్రెడిట్‌ అకౌంటు తెరిచినా, అలాగే పోస్టాఫీసులో కరెంటు ఖాతా తెరిచినా ఎటువంటి పరిమితులు లేవు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. తగిన జాగ్రత్త వహించి అడుగేయండి. ఎన్ని నిబంధనలు ఎంత కఠినంగా అమలుపర్చినా మీ డిపాజిట్లకు సరైన ‘‘సోర్స్‌’’ ఉంటే .. సరిలేరు మీకెవ్వరు.  
 - కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య (ట్యాక్సేషన్‌ నిపుణులు)

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top