ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
నిర్వహణ కార్మిక బాధ్యత
డిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్‌జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.
హాంగ్‌జౌ, బీజింగ్ తీర్పుల సారాంశం
హాంగ్‌జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్‌పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.
బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్‌కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్‌ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.
ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.
మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?
ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్‌పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్‌స్కిల్లింగ్‌ను తప్పనిసరి చేయనుంది.
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్ వర్క్‌ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: మార్కెట్‌లో జూదం ఆడుతున్నారు!


