ఈ నెల 13 బంగారం గనుల అమ్మకం!

Centre may sell 13 block gold mines in Uttar Pradesh, Andhra pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో పది బ్లాక్‌లు

ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు

న్యూఢిల్లీ: దేశ స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) మైనింగ్‌ రంగం సహకారం మరింత పెరగడానికి వ్యూహ రచన చేస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 13 బంగారు గనులను ఈ నెల్లో వేలం వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. వీటిలో 10 ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, మరో మూడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 10 బ్లాకుల్లో ఐదు బ్లాకుల వేలం ఆగస్టు 26న జరగవచ్చని సమాచారం. మిగిలిన ఐదు బ్లాకులను ఆగస్టు 29న వేలం వేయవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వేలం వేయనున్న బ్లాకుల్లో... రామగిరి నార్త్‌ బ్లాక్, బొక్సంపల్లి నార్త్‌ బ్లాక్, బొక్సంపల్లి సౌత్‌ బ్లాక్, జవాకుల–ఎ బ్లాక్, జవాకుల–బి బ్లాక్, జవాకుల–సి బ్లాక్, జవాకుల–డి బ్లాక్, జవాకుల–ఈ బ్లాక్, జవాకుల–ఎఫ్‌ బ్లాక్‌ ఉన్నాయి.

వీటికి టెండర్లను ఆహ్వానిస్తూ, గత మార్చి నెల్లో నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్‌ బ్లాక్‌ల వేలం కూడా ఇదే నెల్లో జరిగే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అయితే నిర్దిష్టంగా తెలియరాలేదు.  ఈ రాష్ట్రంలోని మూడు పసిడి బ్లాక్స్‌లో రెండు.. సోనపహరి బ్లాక్,  ధుర్వ–బియాదండ్‌ బ్లాక్‌  రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద జిల్లా సోనభద్రలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మూడు బ్లాక్‌ల వేలానికి టెండర్లను ఆహ్వానిస్తూ, మే 21న నోటీసులు జారీ అయ్యాయి.  

దేశాభివృద్ధికి దన్నుగా...
దేశ ఎకానమీలో గనుల భాగస్వామ్యం పెరగడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు కేంద్రం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాలు ఆగస్టు 4 నాటికి 199 మినరల్‌ బ్లాక్‌లను వేలం వేశాయి.  2015లో మైనింగ్‌ చట్టంలో సవరణ తర్వాత వేలం మార్గం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్‌ బ్లాక్‌లను అమ్మకానికి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ద్వారా ఆదాయంలో చాలా మంచి వాటాను పొందుతున్నాయని కేంద్రం పేర్కొంటోంది.

ఈ రేసులో మొదట ఉన్న రాష్ట్రాలు ఆదాయాల వాటా విషయంలో సంతోషంగా ఉన్నాయని తెలుపుతోంది. ఖనిజాల వేలం నిబంధనలలో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, తద్వారా బ్లాక్‌ల విక్రయంలో మరింత భాగస్వామ్యానికి అవకాశం ఉంటుందని గనుల మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. మినరల్స్‌ (ఎవిడెన్స్‌ ఆఫ్‌ మినరల్‌ కంటెంట్స్‌) రూల్స్, 2015 (ఎంఈఎంసీ రూల్స్‌), మినరల్స్‌ (ఆక్షన్‌) రూల్స్, 2015 (ఆక్షన్‌ రూల్స్‌)ను సవరించడానికి కేంద్ర గనుల మంత్రిత్వశాఖ పలు నిబంధనలను నోటిఫై చేసింది.

వీటిలో మినరల్స్‌ (ఎవిడెన్స్‌ ఆఫ్‌ మినరల్స్‌ కంటెంట్స్‌) రెండవ సవరణ నిబంధనలు, 2021, మినలర్‌ (ఆక్షన్‌) నాల్గవ సవరణ నిబంధనలు, 2021 ఉన్నాయి. రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలు, గనుల విభాగంలో నిపుణులు, ఇతర భాగస్వాములు, సాధారణ ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సవరణ నియమాలు రూపొందాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top