వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం

Central Govt Speedup Vizag Steel Privatisation  - Sakshi

సలహాదారు కోసం బిడ్లు ఆహ్వానం 

బిడ్లకు 28 వరకు గడువు 

కార్మిక సంఘాల ఆగ్రహం

సాక్షి, ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా లీగల్‌ అడ్వైజర్‌ (న్యాయæ సలహాదారు), ట్రాన్సాక్షన్స్‌ అడ్వైజర్‌ (వ్యవహారాలు సలహాదారు)ల కోసం ప్రభుత్వం బుధవారం బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జనవరి 27న కేంద్ర కేబినెట్‌ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్ణయం తెలిసిన నాటి నుంచి స్టీల్‌ప్లాంట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు, బంద్‌లు, సమ్మెలు నిర్వహించారు. అప్పటి నుంచి కూర్మన్నపాలెం కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు చేసే ఉద్యమాలకు రాష్ట్రంలోని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి సహకారం అందిస్తూ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు సార్లు కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది.

గత నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో స్వయంగా కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జరిపిన చర్చల్లో కూడా స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని కోరడం జరిగింది. అయినా కేంద్రం తన దూకుడును కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గత నెల 22న న్యూఢిల్లీలో జరిగిన దీపమ్‌ సమావేశంలో లీగల్‌ అడ్వైజర్, ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌లను నియమించాలని నిర్ణయించారు. బిడ్లకు సంబంధించిన దరఖాస్తులను బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ప్రీ బిడ్‌ మీటింగ్‌ ఈనెల 15న ఏర్పాటు చేశారు. ఈనెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. టెక్నికల్‌ బిడ్‌ను ఈనెల 29న తెరవనున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top