జనవరిలో 5జీ ‘టెస్ట్‌బెడ్‌’ | Sakshi
Sakshi News home page

జనవరిలో 5జీ ‘టెస్ట్‌బెడ్‌’

Published Fri, Dec 10 2021 2:16 PM

Central Government Will Allow 5G Testbed In January - Sakshi

న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర టెలికం రంగ సంస్థలు 5జీ టెక్నాలజీకి సంబంధించి తమ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడే ‘టెస్ట్‌బెడ్‌’ను జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ (డాట్‌) కార్యదర్శి కె. రాజారామన్‌ ఈ విషయం వెల్లడించారు. నిర్దిష్ట ఉత్పత్తి లేదా సర్వీసును పరీక్షించేందుకు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, నెట్‌వర్క్‌ కాన్ఫిగరేషన్‌ మొదలైనవి ఇందులో ఉంటాయి.

సుమారు రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్‌బెడ్‌ను రూపొందించే ప్రతిపాదనకు 2018 మార్చ్‌లో కేంద్ర టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని ఐఐటీ విద్యా సంస్థలు, సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీ దీని రూపకల్పనలో పాలుపంచుకుంటున్నాయి. ప్రస్తుతం 5జీ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలకు టెలికం శాఖ స్పెక్ట్రం కేటాయించింది. ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు గడువును మే 26 దాకా లేదా వేలం తర్వాత వ్యాపార అవసరాల కోసం స్పెక్ట్రంను కేటాయించే దాకా పొడిగించింది.  
 

చదవండి:5జీ నెట్​వర్క్ అదుర్స్‌, రాకెట్‌ వేగంతో దూసుకెళ్తున్న యూజర్లు

Advertisement
 
Advertisement