‘ఒక్క ప్రశ్నకు నవ్వి బయటకు వచ్చాను’ | Candidate Walks Out of Dream Job Interview After HR Asks Question | Sakshi
Sakshi News home page

‘ఒక్క ప్రశ్నకు నవ్వి బయటకు వచ్చాను’

Aug 4 2026 7:42 AM | Updated on Aug 4 2026 7:42 AM

Candidate Walks Out of Dream Job Interview After HR Asks Question

నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ భద్రత, మంచి వేతనం ఎంత ముఖ్యమో అంతకంటే వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌, గౌరవప్రదమైన పని సంస్కృతి ముఖ్యమని నిరూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం, మంచి రివ్యూ ఉన్నప్పటికీ.. ఇంటర్వ్యూయర్ అడిగిన ఒక విచిత్రమైన ప్రశ్నతో అభ్యర్థి ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వచ్చేశారు.

సంఘటన వివరాల్లోకి వెళ్తే..

సోషల్ మీడియా వేదిక రెడ్డిట్‌లో ‘సహాలిమ్న్’ అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్ ఇటీవల వైరల్ అయింది. సదరు అభ్యర్థి తాను ఎంతో ఉత్సాహంగా హాజరైన ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకుంటూ ‘ఉద్యోగ వివరణ, వేతనం, కంపెనీ రివ్యూలు అన్నీ చాలా బాగున్నాయి. హెచ్‌ఆర్ మేనేజర్‌ను కలిసి ఇంటర్వ్యూలో కూర్చున్న వెంటనే మొదటి ప్రశ్న వేశారు. అదనంగా ఎలాంటి పేమెంట్‌ లేకుండా ఓవర్ టైమ్ (Unpaid Overtime) చేయడాన్ని మీరు ఎలా నిర్వహిస్తారు?’ అని అడిగినట్లు చెప్పారు.

ఆ ప్రశ్న వినగానే అభ్యర్థి మొదట అది సరదా జోక్ అనుకుని నవ్వేశారు. కానీ, ఇంటర్వ్యూయర్ పట్టుబట్టి సమాధానం కోసం చూడటంతో అసలు విషయం అర్థమైంది. కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ తమ ఉద్యోగులంతా పని పట్ల ఎంతో మక్కువ కలిగి ఉంటారని, పని పూర్తి చేయడానికి ఎంత సమయమైనా కేటాయిస్తారని చెప్పారు. అదనపు పని గంటలకు ప్రత్యేకంగా చెల్లింపులు లేదా ట్రాకింగ్ ఉండదని స్పష్టం చేశారు. దీంతో ఏమాత్రం సంకోచించని అభ్యర్థి ‘మీ సమయానికి ధన్యవాదాలు, ఇది నాకు సరైన ఉద్యోగం కాదు’ అని చెప్పి అక్కడికక్కడే ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చారు.

సోషల్ మీడియా స్పందనలు

ఈ పోస్ట్‌కు ఇంటర్‌నెట్‌లో గంటల వ్యవధిలోనే దాదాపు 45,000 పైగా వ్యూస్‌ వచ్చాయి. ‘కంపెనీ మిమ్మల్ని ఉచితంగా శ్రమదోపిడీ చేయాలనే సిద్ధంగా ఉంది. మీరు సరైన నిర్ణయమే తీసుకుని పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఉచిత ఓవర్ టైమ్ శ్రమ వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని, సమర్థవంతమైన నిర్వహణ లేని చోటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement