విదేశీయులకు షాకిచ్చిన కెనడా..ఆందోళన

Canada Prime Minister Justin Trudeau Bans Foreigners From Buying Residential Properties - Sakshi

స్థిరాస్తుల (ఇళ్లు) కొనుగోళ్లు,అమ్మకాల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1,2023 నుంచి రెండేళ్ల పాటు కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో అధికారిక ప్రకటన చేశారు.  

కోవిడ్‌ -19 కారణంగా 2020 నుంచి కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు పలువురు రాజకీయ నాయకులు ఇళ్లపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో అక్కడ ఇళ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆ కొరత తగ్గించాలని కెనడీయన్లు ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు. 

ఆ మరసటి ఏడాది దేశ ప్రధాని పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే లిబరల్‌ పార్టీ ఆఫ్‌ కెనడా తరుపున ట్రూడో రెండోసారి ప్రధాని పదవి కోసం బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కెనడాలో విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లను రెండేళ్ల పాట బ్యాన్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీయే ట్రూడో రెండోసారి ప్రధాని అయ్యేందుకు దోహదపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి అటుంచితే.. ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. 

ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడిదారుల నుంచి సామాన్యుల వరకు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయడానికి వీల్లేదంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ కొత్త చట్టంతో కెనడాలో ఇల్లు కొనుగోలు చేసే అవకాశం విదేశీయులు కోల్పోనున్నారు. 

వడ్డీ రేట్ల పెంపు 
కెనడియన్‌ రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ (సీఆర్‌ఈఏ) లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2022లో ఇళ్ల ధరలు యావరేజ్‌గా $800,000 పెరిగాయి. ఆ తర్వాత 13శాతం తగ్గాయి. అదే సమయంలో కెనడా సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా మార్టిగేజ్‌ ఇంట్రస్ట్‌ రేట్లు భారీగా పెరిగాయి. 2019 నుంచి ఇళ్ల ధరలు 38శాతం పెరిగినట్లు నివేదించగా.. అమ్మకానికి ఉన్న గృహాల జాబితా ప్రీకోవిడ్‌ ముందుకు చేరాయని తెలిపింది.

ఆందోళనలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్‌
ఇళ్ల కొనుగోళ్లపై కెనడా ప్రైమ్‌ మినిస్టర్‌ తీసుకున్న నిర్ణయంపై ఆదేశ రియల్‌ఎస్టేట్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిషేధం కెనడియన్లు, ప్రత్యేకించి వింటర్‌ సీజన్‌లో ఇక్కడ ఉన్న ఇళ్లను అమ్మేసి విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునే వారికి, లేదంటే విదేశీయులు కెనడాలో ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటే మెక్సికో, యూఎస్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.  

చివరిగా::: 

మోర్టిగేజ్‌లోన్‌ అంటే 
ఓ వ్యక్తికి సొంతంగా ఓ ఇల్లు ఉండి పోషణ నిమిత్తం మోర్టిగేజ్‌లోన్‌ పేరిట కొంత మొత్తాన్ని బ్యాంక్‌ నుంచి లోన్‌గా తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు విఫలమైనా, లేదంటే మరణించినా.. మోర్టిగేజ్‌లోన్‌లో ఉన్న ఇంటిని బ్యాంక్‌ అధికారులు వేలంలో అమ్మేస్తారు. ఆక్షన్‌లో వచ్చిన మొత్తంలో ఎంత లోన్‌ ఇచ్చారో తీసుకొని మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందిస్తారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top