విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ రద్దు చేయండి

Budget 2023-24: FICCI Asks Government To Scrap Windfall Tax - Sakshi

దీనివల్ల చమురు–గ్యాస్‌ అన్వేషణకు విఘాతం

ప్రీ–బడ్జెట్‌ నివేదికలో కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ టాక్స్‌ను 2023–24 వార్షిక బడ్జెట్‌లో రద్దు చేయాలని కేంద్రానికి పరిశ్రమల వేదిక– ఫిక్కీ  తన ప్రీ–బడ్జెట్‌ కోర్కెల మెమోరాండంలో విజ్ఞప్తి చేసింది. ఈ పన్ను విధింపు చమురు, గ్యాస్‌ అన్వేషణకు సంబంధించిన పెట్టుబడులకు ప్రతికూలమని తన సిఫారసుల్లో పేర్కొంది. భారతదేశం 2022 జూలై 1వ తేదీన  విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.

తద్వారా అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల  ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది.  అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. ఇంధన రంగానికి సంబంధించి ఫిక్కీ తాజా నివేదికలో ముఖ్యాంశాలు..

► పెట్రోలియం క్రూడ్‌పై స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ (ఎస్‌ఏఈడీ)ని కూడా రద్దు చేయాలి. లేదా అసాధారణ చర్యగా కొంత కాలం లెవీని కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ రేటును యాడ్‌–వాల్రెమ్‌ లెవీగా మార్చాలి. ఇది 100 డాలర్లపైన పెరిగే క్రూడ్‌ ధరలో 20 శాతంగా ఉండాలి.  
► రాయల్టీ (ఆన్‌షోర్‌ ఫీల్డ్‌లకు చమురు ధరలో 20%, ఆఫ్‌షోర్‌ ప్రాంతాలకు 10%) అలాగే చమురు పరిశ్రమ అభివృద్ధి (ఓఐడీ) సెస్‌ (చమురు ధరలో 20%) ఇప్పటికే   భారం అనుకుంటే, విండ్‌ఫాల్‌ పన్ను ఈ భారాన్ని మరింత పెంచుతోంది.  
► విండ్‌ఫాల్‌ టాక్స్‌ వాస్తవ ధరపై కాకుండా, టన్ను ఉత్పత్తిపై మదింపు జరుగుతోంది. దీనివల్ల ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులను దెబ్బతీస్తోంది.

ప్రపంచ ప్రమాణాలు పాటించాలి..
ప్రస్తుతం దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులపై దాదాపు 70% పన్ను విధిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం, 35–40% పన్ను మాత్రమే విధించాలి.   ఈ రంగంలో కీలక పెట్టుబడులకు ఇది పన్ను  దోహదపడుతుంది. ఇంధన రంగానికి మద్దతు ఇవ్వడానికి,  అస్థిర ప్రపంచ ముడి మార్కెట్ల నుండి దేశాన్ని రక్షించడానికి కీలకమైన విధాన సంస్కరణలు తెచ్చేందుకు ఈ బడ్జెట్‌ మంచి అవకాశం.
– సునీల్‌ దుగ్గల్, వేదాంత గ్రూప్‌ సీఈఓ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top