బ్లాక్‌రాక్‌ ‘ఆస్తులు’ ఆవిరి!

BlackRock Q2 profit down 22percent - Sakshi

భారీగా నిర్వహణ ఆస్తులను కోల్పోయిన సంస్థ

ఆరు నెలల్లో రూ.136 లక్షల కోట్లు క్షీణత

న్యూఢిల్లీ: మార్కెట్లో మామూలు ఇన్వెస్టర్లే కాదు. కాకలు తీరిన కంపెనీలూ దెబ్బతింటాయి. ఏకంగా 10 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులున్న బ్లాక్‌రాక్‌ లాంటి దిగ్గజం కూడా గడిచిన ఆరు నెలల్లో స్టాక్‌ మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకోలేకపోయింది. ఈ సంస్థ ఏకంగా తన నిర్వహణ ఆస్తుల్లో లక్షా డెబ్బై వేల కోట్ల డాలర్లను (రూ.136 లక్షల కోట్లు) కోల్పోయింది. అది కూడా ఆరు నెలల కాలంలో. ఇది ఓ ప్రపంచ రికార్డు కూడా. గతంలో ఎన్నడూ ఓ సంస్థ ఆరు నెలల కాలంలో ఇంతలా నిర్వహణ ఆస్తులను కోల్పోలేదు.

నిజానికి 2022 తొలి ఆరు నెలలు ప్రపంచ క్యాపిటల్‌ మార్కెట్లకు ఏమాత్రం కలసి రాలేదనే చెప్పుకోవాలి. ఈ ప్రతికూలతలను ఇతర అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సాధ్యమైన మేర అధిగమించే ప్రయత్నాలు చేశాయి. కానీ, బ్లాక్‌రాక్‌పై మార్కెట్‌ పరిణామాల ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే ఈ సంస్థ నిర్వహణ ఆస్తుల్లో మూడొంతులు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌లోనే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా మారిన ఇన్వెస్టర్ల ప్రాథాన్యతలు సైతం ఈ సంస్థ ఆస్తులపై ప్రభావం చూపించాయి. ఈ సంస్థ నిర్వహించే యాక్టివ్‌లీ మేనేజ్డ్‌ ఫండ్స్‌లో పావు శాతమే బెంచ్‌మార్క్‌ కంటే మెరుగైన పనితీరు చూపించాయి.

8.49 లక్షల కోట్ల డాలర్లు..
జూన్‌ చివరికి బ్లాక్‌రాక్‌ మొత్తం నిర్వహణ ఆస్తులు 8.49 లక్షల కోట్ల డాలర్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం నుంచి చూస్తే 11 శాతం క్షీణించాయి. అసలు బ్లాక్‌రాక్‌ మూలాలు యాక్టివ్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (డెట్‌ ఫండ్స్‌)లోనే ఉన్నాయని చెప్పుకోవలి. 2002లో మొదటి యూఎస్‌ డోమిసిల్డ్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను ఆరంభించగా, గత పదేళ్ల కాలంలో యాక్టివ్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకాల్లోకి 280 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

2022 జూన్‌ 30 నాటికి 954 బిలియన్‌ డాలర్ల ఆస్తులను యాక్టివ్‌ బాండ్‌ ఫండ్స్‌లో నిర్వహిస్తుంటే.. యాక్టివ్‌ ఈక్విటీ ఫండ్స్‌లోని నిర్వహణ ఆస్తులు 393 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి. ఈ ఏడాది బాండ్‌ మార్కెట్‌ కుప్పకూలడం యాక్టివ్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పథకాల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు బయటకు వెళ్లేందుకు దారితీసింది.  ‘‘స్టాక్స్, బాండ్స్‌కు 2022 అత్యంత చెత్త ఆరంభంగా మిగిలిపోతుంది’’ అని బ్లాక్‌రాక్‌ చైర్మన్, సీఈవో లారీఫింక్‌ ఫలితాల సందర్భంగా ప్రకటించడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top