
బెంగళూరులో క్రమంగా క్షీణిస్తున్న జీవన నాణ్యత, నగరంలో పెరుగుతున్న రోజువారీ ఖర్చుల నేపథ్యంలో చాలామంది నివాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు పట్టణం వేగంగా విస్తరిస్తోంది. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. స్థానికంగా నివాసం ఉండేందుకు రెంట్లు, జీవనవ్యయం అధికం అవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తున్నాయి. తొమ్మిదేళ్లు నగరంలో నివాసం ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో చేసిన పోస్ట్‌కాస్తా వైరల్‌గా మారింది.
‘నేను తొమ్మిదేళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నాను. టెక్నాలజీ అభివృద్ధి, మెరుగైన పట్టణ వాతావరణం, జీవన నాణ్యత బాగుంటుందని ఇక్కడకు వచ్చాను. కానీ ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 12 కిలోమీటర్లు ప్రయాణించడానికి నిత్యం మూడు గంటలు ట్రాఫిక్‌తో ఇబ్బందిపడాల్సి వస్తోంది. ఎలాంటి పార్కింగ్ సదుపాయంలేని 1 బీహెచ్‌కే ఫ్లాట్‌కు రూ.30 వేల కంటే అధిక రెంటు ఉంది. క్యాబ్ బుక్ చేయడానికి ఏడు వేర్వేరు యాప్‌లను ఉపయోగిస్తున్నా చాలాసార్లు బుక్ అవ్వదు. నగరంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఎదో అలా బ్రతుకుతున్నాం అంతే..’ అని ఓ వ్యక్తి లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశాడు.
ఇదీ చదవండి: సులువుగా యూఎస్ వీసా రావాలంటే..
ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను ఉద్యోగం కోసం ఇక్కడకు వచ్చాను. చాలా విషయాలతో ఇక్కడే చిక్కుకుపోయాను’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘ట్రాఫిక్ ఆత్మరక్షణలో ఉంది. కుటుంబంతో కంటే ప్రయాణాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను’ అని మరో వ్యక్తి తెలిపారు.