ఫ్యూచర్‌ రిటైల్‌పై బీవోఐ దివాలా అస్త్రం

Bank of India moves NCLT against Future Retail - Sakshi

ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్‌ రిటైల్‌పై బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) దివాలా అస్త్రం ప్రయోగించింది. దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్‌ దాఖలు చేసింది. విజయ్‌ కుమార్‌ వీ అయ్యర్‌ను ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థ ఐఆర్‌పీ (మధ్యంతర రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌/లిక్విడేటర్‌)గా నియమించాలని ఎన్‌సీఎల్‌టీని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభ్యర్థించింది.  

ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌తో కొనసాగుతున్న వ్యాజ్యాలు, సంబంధిత ఇతర సమస్యల కారణం గా ఈ నెల ప్రారంభంలో ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఎల్‌ఆర్‌) తన రుణదాతలకు రూ. 5,322.32 కోట్లు చెల్లించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో దివాలా కోడ్, 2016లోని 7వ సెక్షన్‌ కింద రుణ దాతల కన్షార్షియంకు నేతృత్వం వహిస్తున్న బీవోఐ దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. తాను పిటిషన్‌ కాపీని అందుకున్నానని, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని ఫ్యూచర్‌ గ్రూప్‌ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  

వార్తా పత్రికల్లో ఇప్పటికే నోటీసులు..
బీవోఐ గత నెల వార్తా పత్రికలలో  ఒక పబ్లిక్‌ నోటీసు జారీ చేస్తూ, ఫ్యూచర్‌ రిటైల్‌ ఆస్తులపై తన క్లెయిమ్‌ను ప్రకటించింది. కిషోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ ఆస్తులతో లావాదేవీలు జరపరాదని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించింది. 2020 ఆగస్టులో ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రకటించిన రూ.24,713 కోట్ల డీల్‌లో ఫ్యూచర్‌ రిటైల్‌ ఒక భాగం. ఈ డీల్‌లో భాగంగా రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 19 కంపెనీలను రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)కు విక్రయిస్తున్నట్లు గ్రూప్‌ ప్రకటించింది. ఈ ఒప్పంద ప్రతిపాదన ప్రకారం, 19 కంపెనీలు అన్నీ కలిసి ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే ఒక్క ఒక్క కంపెనీగా విలీనమై తదుపరి ఆర్‌ఆర్‌వీఎల్‌లకు బదిలీ అవుతాయి.  

20 నుంచి సమావేశాలపై ఉత్కంఠ
కాగా, రిలయన్స్‌తో డీల్‌ ఆమోదం కోసం 2022 ఏప్రిల్‌ 20–23 తేదీల మధ్య ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలు తమ సంబంధిత వాటాదారులు రుణదాతలతో సమావేశాలను నిర్వహిస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈ డీల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెజాన్‌ ఈ సమావేశాల నిర్వహణను తీవ్రంగా తప్పు బడుతుండడమే దీనికి కారణం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top