ఏవియేషన్‌ పరిశ్రమ.. వీ షేప్‌ రికవరీ!

Aviation Sector Witnessing Strong V-Shaped Recovery, Passenger Growth Will Continue - Sakshi

దేశీ ప్రయాణికుల్లో వృద్ధి కొనసాగుతుంది

వాయు మార్గంలో ప్రయాణాలకు ఆసక్తి

పౌర విమానయాన మంత్రి సింధియా

న్యూఢిల్లీ: దేశీ పౌరవిమానయాన పరిశ్రమ వీ ఆకారంలో బలమైన రికవరీ చూస్తోందని (ఎలా పడిపోయిందో, అదే మాదిరి కోలుకోవడం) ఈ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దేశీ ప్రయాణికుల సంఖ్యలోనూ బలమైన వృద్ధి కనిపిస్తోందంటూ, రానున్న సంవత్సరాల్లోనూ ఇది కొనసాగుతుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండేళ్లపాటు ఏవియేషన్‌ పరిశ్రమ గడ్డు పరిస్థితులను చూడడం తెలిసిందే. గతేడాది చివరి నుంచి పుంజుకున్న పరిశ్రమ ఈ ఏడాది బలమైన వృద్ధిని చూస్తుండడం గమనార్హం. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు పైనే నమోదవుతోంది.

ప్రయాణికుల సంఖ్య ఎంతో ఉత్సాహకరంగా ఉందంటూ, ఈ ఏడాది నవంబర్‌ నాటికి 111 మిలియన్లకు చేరుకుందని సింధియా వెల్లడించారు. వాయు మార్గంలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటూ, అందుకే ఈ స్థాయి గణాంకాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఏవియేషన్‌ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం గత మంగళవారం 2,883 దేశీ సర్వీసుల్లో 4,15,426 మంది ప్రయాణించారు. ‘‘కరోనా ముందు 2019లో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4.15 లక్షలుగా ఉండగా, గడిచిన రెండు వారాల్లో దీనికి మించి ప్రయాణిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. డిసెంబర్‌ 24న 4.35 లక్షల మంది ప్రయాణించారు’’అని మంత్రి పేర్కొన్నారు.  

కోవిడ్‌ కేసులు ఆందోళనకరం..
ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణకొరియా, జపాన్, యూరప్‌ దేశాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళకర విషయమేనని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘‘మేము ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అందుకే ఆరోగ్యశాఖ సూచనలకు అనుగుణంగా భారత్‌కు వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి స్క్రీనింగ్‌ (పరీక్షలు) నిర్వహిస్తున్నాం. అదృష్టం కొద్దీ ప్రస్తుతం ఎక్కువ కేసులు రావడం లేదు. ఈ విషయంలో కొంత వేచి చూసే ధోరణి అవసరం’’అని చెప్పారు.   

అంత రద్దీని అంచనా వేయలేదు..
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర రద్దీ కారణంగా ప్రయాణికులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కోవడం తెలిసిందే. పండుగల సమయంలో అంత రద్దీని తాము అంచనా వేయలేదని సింధియా చెప్పారు. ‘‘నిజానికి ఇది విమానాశ్రయాల బాధ్యత. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాల్లేని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉంది. రద్దీ వేళల్లో విమానాశ్రయాల సామర్థ్యానికి అనుగుణంగా ట్రాఫిక్‌ను కట్టడి చేయడం, సామర్థ్యాన్ని విస్తరించడం దీనికి పరిష్కారం’’అని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఢిల్లీ విమానాశ్రయంతోపాటు, పలు ఇతర విమానాశ్రయాల్లో రద్దీపై పౌర విమానయాన శాఖకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పౌర విమానయాన శాఖ పలు దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ను నియంత్రించామని, మరిన్ని గేట్లు తెరిచామని మంత్రి చెప్పారు. ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోనూ ఇదే తరహా చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 2019తో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉన్నట్టు తెలిపారు.
 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top