జీఎస్‌టీ తగ్గింపు!- ఆటో షేర్లు రయ్‌రయ్‌

Auto shares zooms due to GST rate reduction hopes on two wheelers - Sakshi

రుణ భారం తగ్గింపు: టాటా మోటార్స్‌ 8 శాతం జూమ్‌

ద్విచక్ర వాహనాల జీఎస్‌టీ కోత అంచనాల ఎఫెక్ట్

‌ హీరో మోటో, టీవీఎస్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో.. జోరు

ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గించాలంటూ ఆటో పరిశ్రమ చేస్తున్న వినతులను పరిశీలించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) 28 శాతంగా అమలవుతోంది. ద్విచక్ర వాహనాలు.. అటు విలాసవంత(లగ్జరీ) కేటగిరీలోకి లేదా ఇటు డీమెరిట్‌లోకీ రావని సీతారామన్‌ వ్యాఖ్యానించారు. దీంతో జీఎస్‌టీ కౌన్సిల్‌ ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గింపునకు వీలుగా సవరణలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి హామీనిచ్చారు. పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సభ్యులతో నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా నిర్మలా సీతారామన్‌ ఈ విషయాలను ప్రస్తావించారు. కాగా.. గురువారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంకానున్నప్పటికీ సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న సమావేశంలో ద్విచక్ర వాహన పన్ను తగ్గింపును చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఆటో రంగ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం ఎగసింది. 

షేర్లు జూమ్‌
ఆటో కౌంటర్లలో మొత్తం రుణ భారాన్ని తగ్గించుకోనున్న ప్రణాళికల నేపథ్యంలో  టాటా మోటార్స్‌ 8 శాతం దూసుకెళ్లింది. ఈ  బాటలో జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అంచనాలతో హీరో మోటో, టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో, అపోలో టైర్‌ 6-3.3 శాతం మధ్య జంప్‌చేయగా.. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, అశోక్‌ లేలాండ్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్‌ మోటార్స్‌, ఎంఆర్‌ఎఫ్‌ 2-0.5 శాతం మధ్య ఎగశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top