టెక్నాలజీ వైపు.. స్టాక్‌ బ్రోకర్ల చూపు!

Around 71 Per Cent Of Stock Brokers Shift Towards A Technology Based Model - Sakshi

న్యూఢిల్లీ: వ్యాపార సేవల్లో టెక్నాలజీ వినియోగాన్ని గణనీయంగా పెంచుకోవడంపై అత్యధిక శాతం స్టాక్‌ బ్రోకర్లు దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా తమ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) బృందంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే యోచనలో ఉన్నారు. బ్రోకరేజి సంస్థల సమాఖ్య అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్ఛేంజెస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎన్‌ఎంఐ) నిర్వహించిన సర్వేలో సుమారు 71 శాతం బ్రోకరేజీలు ఈ అభిప్రాయాలను వెల్లడించాయి. 

ఏఎన్‌ఎంఐలో 900 సంస్థలకు సభ్యత్వం ఉంది. స్టాక్‌బ్రోకింగ్‌ పరిశ్రమలో ఆర్థిక సాంకేతికతల పాత్ర, వాటి వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలపై ఏఎన్‌ఎంఐ గత నెలలో స్టాక్‌టెక్‌ సర్వేను నిర్వహించింది. అధునాతన రీతుల్లో సైబర్‌ దాడులు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో వాటి బారిన పడకుండా తమను, కస్టమర్లను రక్షించుకునేందుకు ఆర్థిక సంస్థలు టెక్నాలజీపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తోందని ఇందులో వెల్లడైంది. దీని ప్రకారం గతేడాది 39 శాతం స్టాక్‌బ్రోకింగ్‌ కంపెనీలు ఐటీ సంబంధ సమస్యలు 
ఎదుర్కొన్నాయి.  

ఫిన్‌టెక్‌ కంపెనీల బాట... 
ఎక్కువగా సాంకేతికతతో పని చేసే ఫిన్‌టెక్‌ కంపెనీలు పెరుగుతుండటంతో ..వాటితో దీటుగా పోటీపడేందుకు సాంప్రదాయ ఆర్థిక సంస్థలు కూడా తమ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవాల్సి వస్తోంది. 2022–23లో సగటున 30 శాతం పెట్టుబడులు సాంకేతికతపైనే వెచ్చించవచ్చని అంచనాలు ఉన్నాయి. సర్వే ప్రకారం వ్యాపార ప్రక్రియల్లో 33 శాతం భాగం ఫిజికల్‌ నుంచి డిజిటల్‌కు మారాయి. 

డిజిటల్‌కు మారడం వల్ల ట్రేడింగ్‌ లావాదేవీల సమర్ధత, వేగం పెరగడం.. వ్యయాల తగ్గుతుండటం, అందుబాటులో ఉండే పరిస్థితి మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు కారణం. కోవిడ్‌ మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితిలోనూ కమ్యూనికేషన్‌కు ఆటంకం కలగకుండా పరిశ్రమ నిలబడేలా టెక్నాలజీ తోడ్పడిందని సర్వే నివేదిక పేర్కొంది. సైబర్‌ దాడుల నుంచి వ్యాపారాలు సురక్షితంగా ఉండేలా కొత్త సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలు దోహదపడగలవని 92 శాతం సంస్థలు ఆశాభావంతో ఉన్నట్లు వివరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top