Apple India: యాప్‌ కమిషన్‌పై సీసీఐలో ఫిర్యాదు.. యాపిల్‌ గప్‌చుప్‌

Apple App Commission Issue Face CCI Probe In India - Sakshi

యాప్‌ మార్కెటింగ్‌ కమిషన్‌ వ్యవహారంలో భారత్‌లోనూ యాపిల్‌కు చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. నిన్నగాక మొన్న దక్షిణ కొరియా ప్రత్యేక చట్టం ద్వారా గూగుల్‌, యాపిల్‌ కమిషన్‌ కక్కుర్తికి దెబ్బేసిన విషయం తెలిసిందే. అయితే యాప్‌ డెవలపర్స్‌ నుంచి బలవంతపు కమిషన్‌ వసూళ్ల ద్వారా పోటీదారులను దారుణంగా దెబ్బ తీస్తోందనే ఆరోపణలపై యాపిల్‌, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

ఈ మేరకు రాజస్తాన్‌కు చెందిన ‘టుగెదర్‌ వీ ఫైట్‌ సొసైటీ’ అనే ఎన్జీవో  సీసీఐలో ఫిర్యాదు చేసింది. యాప్‌ మార్కెట్‌లో మధ్యవర్తిగా ఉండడం ద్వారా కస్టమర్లకు, డెవలపర్లకు మధ్య సమన్వయాన్ని యాపిల్‌ కంపెనీ దెబ్బతీస్తోందని ఫిర్యాదులో పేర్కొంది ఆ సంస్థ. అంతేకాదు ఇతరులకు పోటీలో అవకాశం లేకుండా పోతోందని తెలిపింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీసీఐలో దాఖలైన ఫిర్యాదుపై స్పందించేందుకు యాపిల్‌ నిరాకరించింది. ఇక ఈయూలోనూ యాపిల్‌ దాదాపు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటోంది.
 

ఇక కిందటి ఏడాది కొన్నిస్టార్టప్స్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. గూగుల్‌పై సీసీఐ విచారణ నడుస్తున్న విషయం తెలిసిందే. తమ ప్లేస్టోర్‌ల ద్వారా యాప్‌ పేమెంట్స్‌ ఛార్జీలు 30 శాతం వసూలు చేస్తున్న గూగుల్‌, యాపిల్‌ లాంటి టెక్‌ దిగ్గజాల తీరు.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. అయితే వీటి యాప్‌ మార్కెటింగ్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలనే ప్రయత్నాలకు దక్షిణ కొరియా బీజం వేయగా.. ఇప్పుడు మరికొన్ని దేశాలు ఆ బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సీసీఐ విధులు
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ.  మే 2009 నుంచి ఇది పూర్తి స్తాయిలో పని చేస్తోంది.వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఒకవేళ అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం ఉంది సీసీఐకి.

చదవండి: గూగుల్‌, యాపిల్‌కు భారీ దెబ్బ!

క్లిక్‌ చేయండి: వాట్సాప్‌కు షాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top