దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి | Sakshi
Sakshi News home page

దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి

Published Thu, Nov 24 2022 6:20 AM

Air Passenger Traffic Hits Five-Month High In October On Festive Travel - Sakshi

న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థలు అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సెప్టెంబర్‌లో నమోదైన 1.04 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ 27 శాతం ఎగిసి 89.85 లక్షల నుండి 1.14 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కాలంలో దాదాపుగా నిల్చిపోయిన విమాన ప్రయాణాలు కొంతకాలంగా తిరిగి ప్రారంభమవుతుండటంతో .. విమానయాన పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే.  

డేటాలోని మరిన్ని కీలకాంశాలు..
► దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్‌ ఇండిగో మార్కెట్‌ వాటా సెప్టెంబర్‌లో 58 శాతంగా ఉండగా అక్టోబర్‌లో 56.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌ మార్కెట్‌ వాటా 0.9 శాతం నుండి 1.4 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్‌ వాటా 7.3 శాతంగా, గో ఫస్ట్‌ వాటా 7 శాతంగా ఉంది.
► ఎయిరిండియా మార్కెట్‌ వాటా 9.1 శాతంగా ఉండగా, ఎయిర్‌ఏషియాది 7.6 శాతానికి చేరింది. విస్తార వాటా 9.6 శాతం నుండి 9.2 శాతానికి దిగి తగ్గింది.  
► సమయ పాలనలో (ఓటీపీ) ఎయిరిండియా (90.8 శాతం) అగ్రస్థానంలో ఉండగా విస్తారా (89.1 శాతం), ఎయిర్‌ఏషియా ఇండియా (89.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఈ మూడూ టాటా గ్రూప్‌ కంపెనీలే కావడం గమనార్హం.
► ఇండిగో ఓటీపీ 87.5 శాతంగా ఉండగా, అలయన్స్‌ ఎయిర్‌ (74.5%), స్పైస్‌జెట్‌ (68.9%), గో ఫస్ట్‌ (60.7%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  
► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ఓటీపీని లెక్కించారు.
► 2022 జనవరి–అక్టోబర్‌ మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 9.88 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 6.21 కోట్లతో పోలిస్తే ఎయిర్‌ ట్రాఫిక్‌ 59 శాతం పెరిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement