ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా? | AI can write code so why teach it | Sakshi
Sakshi News home page

ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?

Jul 7 2025 1:46 PM | Updated on Jul 7 2025 3:07 PM

AI can write code so why teach it

సాంకేతిక పరిశ్రమలో పెరుగుతున్న కృత్రిమమేధ కోడింగ్ భవిష్యత్తుపై సందేహాలు కలిగిస్తోంది. ‘ఏఐ ఇప్పటికే తన కోడ్‌ను తానే వేగంగా, తక్కువ ఖర్చుతో, మరింత నాణ్యతతో రాయగలుగుతోంది. అలాంటప్పుడు పిల్లలకు ఈ నైపుణ్యం నేర్పించాల్సిన అవసరం ఏమిటి?’ అనే ఆందోళన ప్రస్తుతం తల్లిదండ్రుల్లో అధికమవుతోంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో టెక్‌ విద్య కోసం పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తల్లిదండ్రులు అపారమైన సమయం, డబ్బు, శ్రమ, భావోద్వేగాలను పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది కేవలం విద్యగా మాత్రమే కాకుండా ఉన్నత జీవనానికి నాందిగా చూస్తున్నారు.

తల్లిదండ్రుల్లో భయం

ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో తల్లిదండ్రుల్లో భయం పేరుకుపోతోంది. పిల్లల చదువు పూర్తయి ఉద్యోగాలు చేసే సమయానికి వారు ప్రస్తుతం నేర్చుకునే నైపుణ్యాలకు అప్పటి మార్కట్‌లో గిరాకీ ఉంటుందా?అనే సందేహం కలుగుతోంది. దానికి సమాధానం సంక్లిష్టమైనది. కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏటా భారతదేశంలో సుమారు 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాపొంది బయటకు వస్తున్నారు. కానీ 2025 నాటికి, వారిలో కేవలం 10% మందికే అర్థవంతమైన ఉద్యోగాలు దక్కుతున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి.

ఊహాత్మక సంక్షోభమే..

అంతేకాకుండా, గ్రాడ్యుయేట్లలో సగానికి పైగా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లలో దాదాపు 40% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి కోడింగ్ డిమాండ్‌ లేకపోవడం కారణమేమీ కాదు. మనం బోధిస్తున్న కోడింగ్ విధానం, ముఖ్యంగా ఆలోచనా సరళి మార్కెట్‌కు తగిన విధంగా లేదు. ఇది కంటెంట్ సంక్షోభం కాదు, ఊహాత్మక సంక్షోభమే. మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళదాం. కాలిక్యులేటర్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు గణితం బోధించటం ఆపామా? గూగుల్ వచ్చినప్పుడు రాయడం నేర్పించటం మానామా? కాదుకదా. మనం బోధించే విధానాన్ని మార్చుకున్నాం. పఠనం కాకుండా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాం. కోడింగ్లో కూడా ఇదే మార్పు అవసరం అవుతుంది.

కోడింగ్‌ కనుమరుగవ్వదు..

భవిష్యత్తులో సరైన ప్రశ్నలు అడగడం, మానవులకు అనుగుణంగా ఉండేలా కోడింగ్‌ రూపొందించడం, బాధ్యతాయుతంగా మెలగడం, మెషీన్‌ వ్యవస్థలు ఎక్కడ తక్కువ పడుతున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యమవుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, ఎన్విరాన్‌మెంట్‌, డిజైన్, గవర్నన్స్, సాహిత్యం ఇంకా అనేక రంగాల్లో విస్తరించనుంది. కోడింగ్ కనుమరుగవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు..

అయితే భవిష్యత్తులో రాబోయే కోడింగ్ కేవలం సూచనలను అనుసరించే వారికే పరిమితం కాదు. ఇది విమర్శనాత్మకంగా ఆలోచించే, త్వరగా స్వీకరించే, సృజనాత్మకంగా రూపొందించే వ్యవస్థలకు విస్తరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అనుసరిస్తున్న లెర్నింగ్ విధానాలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనే లక్ష్యాలు ఇకపై సరిపోవు.

విద్య ఉపాధి సాధనం కాదు..

ఇంజినీరింగ్ డిగ్రీ వల్ల పిల్లలకు ఉద్యోగం రాకపోవచ్చనే తల్లిదండ్రుల ఆందోళన తప్పేమీ లేదు. కానీ అందుకు పరిష్కారం కోడింగ్‌ను వదిలేయడం కాదు. విజయాన్ని నిర్వచించే సంకుచిత ప్రమాణాల నుంచి బయటపడటమే అసలు పరిష్కారం. విద్యను కేవలం ఉపాధి సాధనంగా పరిగణించే దశ దాటిపోయింది. ఇప్పుడు అంచనాలను పెంచాల్సిన సమయం వచ్చింది. ‘ఎలా?’ అని మాత్రమే కాదు, ‘ఎందుకు?’ అని కూడా ప్రశ్నించే ధోరణి, ఆసక్తిని పిల్లల్లో పెంపొందించాలి. కోడింగ్‌ను సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం లేదా భాషాశాస్త్రంతో కలిపి అన్వేషించాలనుకుంటే వారికి ప్రోత్సాహం అందించాలి. భవిష్యత్తులో వీటికి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంటుంది.

‘ఇంటెలిజెన్స్’ అంటే..

‘ఇంటెలిజెన్స్’ అంటే ఫార్ములాలను జ్ఞాపకం చేసుకోవడం, పరీక్షలు పాస్ అవడం కాదు. ఇవి పిల్లల తెలివితేటలకు సూచికలు కావు. కేవలం క్రమశిక్షణకు సంకేతాలు మాత్రమే. అయితే, నిజమైన మేధస్సు అనేది వివరణాత్మకమైనది. ఇది మనం నేర్చుకునే అంశాలను లోతుగా ఆలోచించమని, మెషీన్లు చేయలేని పనులను పూర్తి చేయాలని తెలుపుతుంది. ఇప్పటికే ఏఐ తెలిసిన అంశాలను క్షణ్లాలో ముందుంచుతుంది. క్రియేటివిటీతో ఎవరికీ తెలియని కొత్త అంశాలను అన్వేషించేలా నైపుణ్యాలు మలుచుకోవాలి. క్రియేటివిటీతో తెలియని సమస్యలకు అసలైన పరిష్కారాలు కనుగొనాలి. ఇప్పటివరకు ఎవ్వరూ రూపొందించని దాన్ని డిజైన్ చేయాలి.

ఇతర దేశాల్లో ఇలా..

జర్మనీలోని ఆర్‌డబ్ల్యూటీహెచ్‌ ఆచెన్ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌ను భాషాశాస్త్రం, మీడియా అధ్యయనాలతో మిళితం చేస్తోంది. ఫిన్‌లాండ్‌లోని హెల్సింకి విశ్వవిద్యాలయం విద్యార్థులకు డేటా సైన్స్‌ను తత్వశాస్త్రం(ఫిలాసఫీ)తో కలిపి అభ్యసించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. స్వీడన్, డెన్మార్క్‌లో ఏఐ ప్రోగ్రాముల్లో విభిన్న మార్పులు చేస్తున్నారు. ఇవి కేవలం ప్రయోగాత్మక ఆలోచనలు కావు. ఇవే భవిష్యత్తు విద్యా మోడళ్లకు మార్గదర్శకాలు.

భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి..

భారతదేశానికి ఇదో గొప్ప అవకాశం. అవుట్‌సోర్స్‌ కోడింగ్‌ సర్వీసులు అందించేలా ఎదిగేందుకు మార్గం ఉంది. లేదా రాబోయే కాలానికి సిద్ధంగా ఉన్న మేధావులను పెంపొందించే ప్రయోగశాలగా మారవచ్చు. అందుకోసం పిల్లల్లో పటిష్ట నైపుణ్యాలను పెంపొందించాలి. ఏఐ యుగంలో లోతుగా ఆలోచించగలిగే, నిర్మాణాత్మకంగా క్రియేటివిటీ కలిగిన వారే విజయం సాధిస్తారు. పిల్లలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.

కరుణ్ తాడేపల్లి, సీఈఓ బైటెక్సెల్‌(హైదరాబాద్‌లోని స్టార్టప్‌ సంస్థ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement