
సీఐఐ ప్రెసిడెంట్ శోభనా కామినేని
దీర్ఘకాలిక కోణంలో భారత్‌లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని అపోలో హెల్త్‌కో చైర్‌పర్సన్, పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ శోభనా కామినేని తెలిపారు. వీటిని అందిపుచ్చుకునేందుకు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా తయారీ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అమెరికా విధించిన విపరీతమైన టారిఫ్‌ల వల్ల అనిశ్చితులు తలెత్తాయని ఆమె తెలిపారు. మరింత మెరుగ్గా రాణించేందుకు ఏం చేయాలనేది లోతుగా ఆలోచించేందుకు ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలని వివరించారు. కృత్రిమ మేథ వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో నెలకొందని మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. మనం 4 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగినా, జీడీపీ మూడింతలు పెరిగినా, అందరికీ ఉద్యోగాలు దొరక్కపోతే సామాన్యుడికి ఏం ప్రయోజనం దక్కుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని శోభన చెప్పారు.
ఉద్యోగాలు కల్పించడమనేది ప్రతి చిన్న, పెద్ద వ్యాపారాల బాధ్యత అని తెలిపారు. భారత్‌లో ప్రతిభావంతులకు కొదవలేదని, ఏఐ సొల్యూషన్స్‌ను రూపొందించడంలో మన దేశం ప్రపంచానికి సారథ్యం వహించాలని పేర్కొన్నారు. మరోవైపు, తమ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ తర్వాత మరో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా కంట్రీ హెడ్ (ఇండియా) అరుణ్ శ్రీనివాస్ తెలిపారు.