Adani Group Enters Healthcare: ఏషియా కుబేరుడు గౌతమ్‌ అదానీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఇదే?

Adani Group enters healthcare - Sakshi

హెల్త్‌కేర్‌ రంగంలోకి అదానీ

ఏహెచ్‌వీఎల్‌ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటు

4 బిలియన్‌ డాలర్ల వరకూ పెట్టుబడులు

న్యూఢిల్లీ: పోర్టులు, విమానాశ్రయాల నుంచి సిమెంటు, ఇంధనం వరకూ వివిధ రంగాల్లోకి విస్తరించిన అదానీ గ్రూప్‌ తాజాగా హెల్త్‌కేర్‌ (ఆరోగ్య సంరక్షణ) విభాగంపైనా దృష్టి పెట్టింది. భారీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ చెయిన్స్, ఆఫ్‌లైన్‌..డిజిటల్‌ ఫార్మసీల కొనుగోళ్ల ద్వారా భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉంది. ఇందులో భాగంగా మే 17న అదానీ హెల్త్‌ వెంచర్స్‌ (ఏహెచ్‌వీఎల్‌) పేరిట పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.

ఆస్పత్రులు, వైద్య పరీక్షా కేంద్రాలు, రీసెర్చ్‌ కేంద్రాలు ఏర్పాటు సహా హెల్త్‌కేర్‌ సంబంధ వ్యాపార కార్యకలాపాలను ఏవీహెచ్‌ఎల్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. హెల్త్‌కేర్‌ విభాగంలో ఎంట్రీకి సంబంధించి గ్రూప్‌ ఇప్పటికే పలు పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు, దాదాపు 4 బిలియన్‌ డాలర్ల వరకూ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే స్విస్‌ దిగ్గజం హోల్సిమ్‌ ఇండియా వ్యాపారాన్ని 10.5 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్‌ సిమెంటు రంగంలోకి కూడా ప్రవేశించింది.  

హెచ్‌ఎల్‌ఎల్‌ కొనుగోలుకు పోటీ..
ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థ హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ (హెచ్‌ఎల్‌ఎల్‌)ను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్, పిరమాల్‌ హెల్త్‌కేర్‌ పోటీ పడుతున్నట్లు సమాచారం. హెచ్‌ఎల్‌ఎల్‌లో 100 శాతం వాటాలను ప్రైవేట్‌ సంస్థలకు విక్రయించాలని 2021 డిసెంబర్‌లో ప్రభుత్వం నిర్ణయించుకుంది. కంపెనీ కొనుగోలుకు ప్రాథమికంగా ఏడు బిడ్లు వచ్చాయి.  దేశీయంగా హెల్త్‌కేర్‌ మార్కెట్లో స్థానిక, ప్రాంతీయ సంస్థలదే హవా ఉంటోంది.

ఇటీవలి ఆన్‌లైన్‌ ఫార్మసీ విభాగంలో పెద్ద స్థాయిలో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్‌ నమోదయ్యాయి. ఆన్‌లైన్‌ ఫార్మసీ నెట్‌మెడ్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 620 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. టాటా గ్రూప్‌ కూడా 1ఎంజీ కొనుగోలు ద్వారా ఆన్‌లైన్‌ ఫార్మా వ్యాపారంలోకి ప్రవేశించింది. హెల్త్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీతో గౌతమ్‌ అదానీ (అదానీ గ్రూప్‌ చీఫ్‌), ముకేశ్‌ అంబానీల (రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చీఫ్‌) మధ్య పోరు మరింతగా పెరుగుతుందనే అభిప్రాయం నెలకొంది. అయితే, హెల్త్‌కేర్‌ ఇన్‌ఫ్రాపై అదానీ, రిటైల్‌ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంపై అంబానీ .. వేర్వేరు విభాగాలపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నాయి.

చదవండి: అదిరిందయ్యా అదానీ.. ‘పవర్‌’ఫుల్‌ లాభాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top