‘AI’ విధ్వంసం : వేలాది మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు!

About 3,900 People Lost Their Jobs Because Of Artificial Intelligence In May - Sakshi

ఓ వైపు ఆర్ధిక మాంద్యం భయాలు మరోవైపు చాపకింద నీరులా వ్యాపిస్తున్న కృత్తిమ మేధ (artificial intelligence). వెరసీ టెక్నాలజీ రంగానికి చెందిన ఉద్యోగుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మాంద్యం భయాలతో టెక్‌ సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి.

ఇప్పుడు ఉద్యోగులకు చాట్‌జీపీటీ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తుందా అనేది ఊహకు కూడా అందడం లేదు. తాజాగా విడుదలైన ఓ నివేదిక ఈ ఏడాదిలో భారీ సంఖ్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ (AI) కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకోనున్నట్లు తెలుస్తోంది.  

గ‌త కొద్ది నెల‌లుగా టెక్ జాబ్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో గత ఏడాది నవంబర్‌ నెలలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఓపెన్‌ ఏఐ విడుదల చేసిన ఏఐ టూల్‌ చాట్‌జీపీటీతో ఉద్యోగుల ప‌రిస్ధితి మ‌రింత ఆందోళనకరంగా మారింది. చాట్‌జీపీటీకి ఊహించని విధంగా అనూహ్య స్పందన రావడంతో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌తో పాటు వందలాది కంపెనీలు ఏఐ టూల్స్‌ను రూపొందించే పనిలో పడ్డాయి. 

టెక్‌ విభాగంలో ఎంతో కష్టతరమైన పనుల్ని అవలీలగా చేస్తుండడంతో సంస్థలు ఏఐ టూల్స్‌తో మనుషుల స్థానాన్ని భర్తి చేస్తున్నాయి. దీంతో మేలో ఏకంగా 4000 మంది టెకీల‌ను ఏఐ రీప్లేస్ చేసింద‌నే రిపోర్ట్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.

అమెరికా కేంద్రంగా ప్లేస్‌మెంట్‌, ట్రాన్స్‌ లేషన్‌ కార్యకలాపాలు నిర్వహించే ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ సంస్థ ఓ రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం.. గత నెలలో మొత్తం 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోగా..వారిలో కృత్తిమ మేధ టూల్స్‌ కారణంగా 3,900 మంది నిరుద్యోగులయ్యారని హైలెట్‌ చేసింది. ఆర్ధిక అనిశ్చితి, ఖర్చు తగ్గింపు, పునర్నిర్మాణం’ వంటి కారణాలతో సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు తెలిపింది. 

ఇక ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి మే వరకు 4 ల‌క్ష‌ల మందిని తొలగించినట్లు నివేదిక స్ప‌ష్టం చేసింది. దీనికి తోడు అమెరిక‌న్ కంపెనీలు మనుషులు చేసే ఉద్యోగాల్లో చాట్‌జీపీటీని వాడ‌టం ప్రారంభించినట్లు మ‌రో అధ్య‌య‌నం వెల్ల‌డించింది.
  
చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్‌? అదేంటంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top