అనుయాయులతో బేరసారాలు..
ఐసీడీఎస్‌లో అవినీతి తీగ అల్లుకుపోతోంది. అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ అక్రమాలకు ఆలవాలంగా మారింది. ఆ శాఖ ఉన్నతాధికారి కనుసన్నల్లోనే పోస్టుల అమ్మకాలకు బేరసారాలు సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాల్వంచ పట్టణంలో ఓ ఆడియో వెలుగుచూసింది. మిగతా చోట్ల కూడా సదరు అధికారి తన అనుయాయులతో అందినకాడికి దండుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు పీఏ కల్యాణ్ రూ.కోట్లను కొల్లగొట్టిన ఉదంతం ఇటీవల వెలుగు చూసిన విషయం విదితమే. తాజాగా ఐసీడీఎస్‌పై అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. – భద్రాచలం
మెరిట్ జాబితా అందగానే వసూళ్ల పర్వతానికి తెరలేపారు. జాబితాలోని పేర్లు లీక్ చేసి, సదరు అధికారికి సన్నిహితంగా ఉండే సూపర్‌వైజర్లు, వారి సంబంధిత కుటుంబీకులు, అనుయాయులతో అభ్యర్థినులకు ఫోన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మీ పేరు ఫైనల్ లిస్టులో ఉండాలంటే రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించాలని బేరసారాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దరఖాస్తుదారులు కొందరు అప్పులు చేసి ‘అమ్మ’గారికి చెల్లించుకుంటున్నట్లు సమాచారం. అశ్వారావుపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో రూ.3 లక్షల చొప్పున జూనియర్ అసిస్టెంట్ ద్వారా అమ్మించి, ఇంటర్వ్యూలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఇల్లెందు, చండ్రుగొండ, దమ్మపేట, భద్రాచలం, చర్ల తదితర ప్రాజెక్ట్‌ల్లో కూడా బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. మొదటి వారంలో ఇంటర్వ్యూ నిర్వహించాలని ప్రణాళికలను రూపొందించి, ఆ లోగా అమ్మకాలను స్పీడ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.


