రామయ్యకు సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం పురస్కరించుకుని అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

గోదావరి మాతకు హారతి

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలోని గోదావరి స్నాన ఘాట్ల వద్ద ఆదివారం నదీహారతి వైభవంగా నిర్వహించారు. పురోహితులు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన చేసి దివ్య హారతులు సమర్పించారు. గణపతి పూజ, దీపోత్సవం నిర్వహించారు. పురోహితులు రవికుమార్‌, పవన్‌ కుమార్‌ శర్మ, తిరుపతిరావు, పీవీఎస్‌న్‌ రెడ్డి, రామకృష్ణ, శివబాబు, చంద్రశేఖర్‌, రామ్‌చరణ్‌తేజ, రామాచారి తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి విశేషపూజలు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని కోరారు. కొత్తగూడెం ఆర్డీఓ, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాలతోపాటు అన్ని ఎంపీడీఓ కార్యాలయాలలో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గిరిజన దర్బార్‌..

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్‌ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో..

భద్రాచలం డివిజన్‌ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులు సకాలంలో హా జరు కావాలని భద్రాచలం సబ్‌కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజా వాణి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

బెంచ్‌ ప్రెస్‌ పోటీలు ప్రారంభం

పాల్వంచ: పట్టణంలోని ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌లో జిల్లాస్థాయి జూనియర్స్‌, మెన్‌, ఉమెన్‌ వెయిట్‌ కేటగిరీల బెంచ్‌ ప్రెస్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ యుగంధర్‌ రెడ్డి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. చిన్నతనం నుంచే వ్యాయామం అలవాటు చేసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు, మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. పోటీలకు 250 మంది హాజరయ్యారు. అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేష్‌, జిల్లా సెక్రటరీ రామ్‌రెడ్డి, ట్రెజరర్‌ భవానీ శంకర్‌, కొత్తగూడెం అధ్యక్షుడు ఝెర్రా కామేష్‌, వై.వెంకటేశ్వర్లు, షంషుద్దీన్‌, అమీరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement